icon icon icon
icon icon icon

భువనగిరి కోట ఎవరి పరం..!

భువనగిరి లోక్‌సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగామలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది.

Published : 03 May 2024 04:20 IST

మోదీ, రేవంత్‌, కేసీఆర్‌ కరిష్మాపైనే అభ్యర్థుల ఆశలు
ఉనికి కోసం ఎన్నికల బరిలో సీపీఎం
భువనగిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

భువనగిరి లోక్‌సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ భారాస పట్టు నిలుపుకొనేందుకు చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో ఎన్నికల మిత్రత్వాన్ని ప్రదర్శిస్తున్నా, భువనగిరిలో మాత్రం సీపీఎం బరిలో నిలిచింది.


కొత్త... పాతల కలయిక

ఈ నియోజకవర్గంలో బరిలో కొత్త, పాత అభ్యర్థుల మధ్య ఎన్నికల సమరం సాగుతోంది. భాజపా అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఈ నియోజకవర్గం నుంచి మూడో సారి పోటీ చేస్తూ ఓటర్లకు చిరపరిచితుడిగా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఎన్నికల బరిలో దిగటం ఇదే తొలిసారి. భారాస నుంచి పోటీ చేస్తున్న క్యామా మల్లేష్‌ గతంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించారు. భారాసలో చేరి ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల బరిలో దిగటం ఇదే తొలిసారి. సీపీఎం అభ్యర్థి గడిచిన కొన్నేళ్లుగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఆ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నారు.


చడీచప్పుడు లేని ప్రచారం

నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం అంతగా లేదు. ముఖ్య కేంద్రాల్లో కూడా పార్టీ జెండాలు, ప్రచార వాహనాల సందడి అంతగా కనిపించని పరిస్థితి. అసెంబ్లీ సెగ్మెంట్‌ కేంద్రాల్లో మాత్రమే అభ్యర్థులు ముఖం చూపించి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే భాజపా అభ్యర్థి పేరు ముందుగా ప్రకటించటంతో ఆయన ప్రధాన నగరాలు, ముఖ్య గ్రామాల్లో పర్యటించిన దాఖలాలున్నాయి.


దరిచేరని ఎంఎంటీఎస్‌

మూసీ కాలుష్యం పీడ దశాబ్దాలుగా విరగడ కాకపోవటం ఓటర్లకు ఆవేదనగా ఉంది. పాలకుల హామీలు కార్యరూపంలోకి రాకపోవటం విమర్శలకు దారితీస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు వచ్చిన ఎంఎంటీఎస్‌ యాదాద్రి వరకు తీసుకువస్తామన్న పాలకుల హామీ కాగితాల్లోనే ఉంది. భువనగిరి నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక నడవా ఏర్పాటు చేస్తామన్న మునుపటి పాలకుల వాగ్దానాలు కార్యరూపం దాల్చలేదు. మల్కాపురంలో ఇండస్ట్రియల్‌ గ్రీన్‌ పార్క్‌ ఆచరణకు నోచుకోలేదు. డ్రై పోర్టును అక్కడా ఇక్కడా అంటున్నారే మినహా ఎక్కడా ప్రకటించకపోవటంతో ఓటర్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


కాంగ్రెస్‌లో భరోసా...

కాంగ్రెస్‌.. గెలుపుపై భరోసాతో ఉంది. గడిచిన ఎన్నికల్లో పార్టీ ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే కావటం తమకు ప్రధాన బలమని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు నాలుగు నెలలే కావటం మరింత సానుకూలమని పేర్కొంటున్నాయి. 2009లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు బాధ్యతను ఆయన తీసుకొని పనిచేస్తున్నారు.

ఇటీవల వరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇక్కడ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. కోమటిరెడ్డి సోదరుల పట్టు కిరణ్‌కుమార్‌రెడ్డికి కొంత ఉపయుక్తంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గ పునర్విభజనతో ఏర్పడిన భువనగిరి లోక్‌సభ స్థానానికి ఇది నాలుగో ఎన్నిక. 2009లో, 2019లో ఆ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా కోమటిరెడ్డి సోదరులు గెలుపొందారు. 2014లో పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఉండకపోవటం మైనస్‌గా పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ పార్టీ గుర్తు, పోలింగ్‌ కేంద్రం స్థాయిలో నెట్‌వర్క్‌ కలిసి వస్తుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరిష్మా అదనపు ప్రయోజనంగా పార్టీ భావిస్తోంది.


భాజపా ధీమా...

దేశవ్యాప్తంగా వీస్తున్న మోదీ పవనాలపైనే భాజపా ఆశలు పెట్టుకుంది. పార్టీ నుంచి పోటీకి దిగిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ భారాసను వీడి భాజపాలో చేరారు. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు కావటం పెద్ద బలమని పార్టీ భావిస్తోంది. 2014లో ఇక్కడి నుంచి భారాస(నాటి తెరాస) అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. 2019లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అది కూడా కేవలం 5,219 ఓట్ల తేడాతో. ఆ ఎన్నికల్లో సింగపాక లింగం అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనకు రోడ్డు రోలర్‌ గుర్తు లభించింది. ఆయనకు 27,973 ఓట్లు వచ్చాయి.

నర్సయ్యగౌడ్‌ ఓటమికి అదీ ఒక కారణమని అప్పట్లో ఆ పార్టీ అభిప్రాయపడింది. ఇప్పుడు ఆయన పోటీ చేయడం మూడోసారి. తాజాగా భాజపా తరఫున పోటీ చేస్తున్న ఆయనకు క్షేత్రస్థాయి ఓటర్లతో సంబంధాలు కలిసి వస్తాయని పార్టీ అంచనా. పెద్ద సంఖ్యలో ఉన్న ఆయన సామాజికవర్గ ఓటర్లు ఎంతో బలమని విశ్వసిస్తోంది. భారాసతో ఉన్న సంబంధాలు కొంత ఉపయోగపడతాయన్న అభిప్రాయంలో ఉంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల దాకా రప్పించుకోవడానికి, కమలానికి ఓటు వేయించుకోడానికి కావాల్సిన బలగం లేకపోవటం, పార్టీ సీనియర్‌ నేతల మధ్య సమన్వయం ఇంకా కుదరకపోవటం సమస్యగా ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


భారాస ఆశ...

ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ పార్టీ గుర్తుపైనే భారాస ఆశతో ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం జనగామ అసెంబ్లీ స్థానం ఒక్కటే ఆ పార్టీ గెలుచుకుంది. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న క్యామా మల్లేశ్‌ లోక్‌సభకు పోటీ చేయటం ఇదే మొదటిసారి. కేసీఆర్‌కు ఉన్న ఆదరణే బలమైన అస్త్రమని పార్టీ నేతలు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నైరాశ్యం నుంచి పార్టీ శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోకపోవటం పార్టీకి మైనస్‌గా ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లోకి శ్రేణుల వలసలు సమస్యగా తయారైంది. అభ్యర్థికి ఓటర్లతో ఇంతకుమునుపు నుంచి పరిచయాలు లేకపోవటంతో క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి ఓడిపోయినవారు ఇప్పుడు పార్టీ అభ్యర్థి విజయానికి చురుకుగా తెరపైకి రాకపోవటం కూడా సమస్యగానే ఉంది.


పట్టు ఉందని బరిలోకి  సీపీఎం...

ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఉమ్మడి నల్గొండ జిల్లా పెట్టని కోటాగా ఉండేది. ఆ తరవాత ప్రాబల్యం సన్నగిల్లింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పని చేస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించుకుని మహ్మద్‌ జహంగీర్‌ను బరిలోకి దింపింది. అభ్యర్థికి యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టు ఉందని భావించి పోటీ చేయాలని నిర్ణయించింది.

2009లో మహాకూటమి నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్యకు 3,64,225 ఓట్లు వచ్చాయి. 2014లో సీపీఎం నుంచి చెరుపల్లి సీతారాములుకు 50,040, 2019లో సీపీఐ నుంచి గోద శ్రీరాములుకు 28,153 ఓట్లు వచ్చాయి. నామినేషన్‌ దాఖలు సందర్భంలో సీపీఎం బలప్రదర్శన స్థాయిలో జనసమీకరణ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img