icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ గెలిచేదెన్ని?

భాజపాను గద్దె దించి ఈ దఫా దేశ పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇండియా కూటమిని ఏర్పాటుచేసింది.

Published : 06 May 2024 04:41 IST

దక్షిణాదిలో మెరుగ్గా పార్టీ పరిస్థితి
కర్ణాటక, తెలంగాణలపై ఆశలు

ఈనాడు, దిల్లీ: భాజపాను గద్దె దించి ఈ దఫా దేశ పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇండియా కూటమిని ఏర్పాటుచేసింది. మిత్రపక్షాలు బలంగా ఉన్నచోట్ల వాటికి సీట్లు త్యాగం చేసి.. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 330 స్థానాల్లో హస్తం పార్టీ పోటీ చేస్తోంది. అయితే వాటిలో ఎన్నింట విజయభేరి మోగించగలదన్నది ప్రస్తుతం ఆసక్తికర ప్రశ్నగా మారింది.

71% సీట్లు 5 రాష్ట్రాల్లోనే..

2014లో చరిత్రలో అత్యల్పంగా 44 సీˆట్లకు పడిపోయిన కాంగ్రెస్‌ 2019 నాటికి కొంత మెరుగుపడి 52 స్థానాలు గెలుచుకుంది. అయిదేళ్ల కిందట దానికి దక్కిన నియోజకవర్గాలు 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం 52 సీట్లలో 71% సీˆట్లు కేరళ, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ, అస్సాంల్లో రాగా.. మిగిలిన వాటిలో కలిపి 29% దక్కాయి.

20 మంది అభ్యర్థుల మార్పు

2019లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎంపీల్లో ముగ్గురు పార్టీ మారారు. మరో ముగ్గురు అసెంబ్లీలకు ఎన్నికై ఇప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు. ఒకరు మరణించారు. ఇంకా ఇతర కారణాలతో కాంగ్రెస్‌ మొత్తంగా ఈసారి 20 మంది అభ్యర్థులను మార్చింది. ముగ్గురికి స్థానచలనం కల్పించింది. గత ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్‌, అస్సాంలలో కలిపి హస్తం పార్టీ 34 స్థానాలు దక్కించుకుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 51 సీట్లలో పోటీ చేస్తోంది. కర్ణాటక (28), ఒడిశా (21), తెలంగాణ (17), ఉత్తర్‌ప్రదేశ్‌ (17), ఛత్తీస్‌గఢ్‌ (11), మహారాష్ట్ర (15), పశ్చిమబెంగాల్‌ (14), బిహార్‌ (9), ఝార్ఖండ్‌ (7)ల్లో 139 స్థానాల్లో బరిలో ఉంది. ఈ 9 రాష్ట్రాల్లో కలిపి 2019లో పార్టీ కేవలం 13 సీˆట్లు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో కలిపి 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో అయిదేళ్ల కిందట పార్టీకి ఒక్క సీటూ రాలేదు.


కర్ణాటక, తెలంగాణలపై ఆశలు

2019 తరహాలోనే కేరళ, తమిళనాడుల్లో కాంగ్రెస్‌ ఇప్పుడూ బలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణల్లో కచ్చితంగా సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అస్సాంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. పంజాబ్‌లో చతుర్ముఖ పోటీ కారణంగా గతంకంటే సీˆట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్‌, హరియాణాల్లో ఈసారి బోణీ కొట్టడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశాల్లో మాత్రం ఇప్పుడూ పరిస్థితి ఆశాజనకంగా లేదంటున్నారు. మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలో పార్టీ ఎంతమేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా దేశవ్యాప్త పరిస్థితులను బట్టి చూస్తే కాంగ్రెస్‌ పరిస్థితి దక్షిణాదిలో కొంత మెరుగ్గా, ఉత్తరాదిలో దాదాపుగా 2019 మాదిరిగానే కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన 52 సీˆట్లలో 19 చోట్ల 50 వేలలోపు మెజార్టీతోనే బయటపడింది. అందులోనూ 5 నియోజకవర్గాల్లో ఆధిక్యం 10 వేల కంటే తక్కువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img