icon icon icon
icon icon icon

Adilabad: గతంలో దోస్తీ.. నాలుగోసారి కుస్తీ

ఆదిలాబాద్‌ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భారాసనుంచి బరిలోకి దిగిన ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాయల్‌ శంకర్‌లది గతంలో విడదీయరాని బంధం.

Updated : 21 Nov 2023 14:08 IST

జోగు రామన్న.. పాయల్‌ శంకర్‌ ప్రస్థానం ప్రత్యేకం

పాయల్‌శంకర్‌, భాజపా అభ్యర్థి, జోగురామన్న, భారాస అభ్యర్థి

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: ఆదిలాబాద్‌ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భారాసనుంచి బరిలోకి దిగిన ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాయల్‌ శంకర్‌లది గతంలో విడదీయరాని బంధం. అలాంటి మిత్రులు ప్రత్యర్థులుగా మారారు. మూడు సార్లు తలపడగా ఇప్పుడు నాలుగోసారి రంగంలోకి దిగడం ఆసక్తిరేపుతోంది.

ఒకే గూటిపక్షులు..

ఇరువురిది జైనథ్‌ మండలమే. దీపాయిగూడకు చెందిన జోగు రామన్న సర్పంచి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 1995లో తెదేపా తరఫున ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆ సమయంలో ఆయనకు జైనథ్‌ మండల పరిషత్‌ అధ్యక్ష పదవికి ఒక ఎంపీటీసీ మద్దతు అవసరం ఏర్పడింది. ఆ మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అయిదు స్థానాల్లో గెలువగా.. కాంగ్రెస్‌ మూడు, సీపీఐ, జనతాదళ్‌, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోచోట విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా అడ గ్రామానికి చెందిన పాయల్‌ శంకర్‌ నిరాల ఎంపీటీసీగా గెలుపొందారు. ఆయన మద్దతు ఇవ్వడంతో 1995లో జోగురామన్న ఎంపీపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఏ రాజకీయ కార్యక్రమాలైనా కలిసే చేపట్టేవారు. రామన్న 2000లో జైనథ్‌ జడ్పీటీసీగా, 2005లో మరోమారు జడ్పీటీసీగా తెదేపా తరఫున విజయం సాధించారు. మధ్యలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జోగు రామన్న తెదేపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2009లో తిరిగి తెదేపా తరఫున పోటీ చేసిన జోగు రామన్న విజయఢంకా మోగించారు. అటు పాయల్‌శంకర్‌ అడ సర్పంచిగా, ఆయన సతీమణి నిరాల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొంది అంచెలంచెలుగా ఎదిగారు. రామన్న 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో తెదేపా తరఫున పాయల్‌ను జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దించారు. జైనథ్‌ జడ్పీటీసీగా గెలుపొందిన పాయల్‌.. అప్పటి నుంచే నియోజకవర్గ నేతగా ఎదిగేందుకు దోహదపడింది.

2012 నుంచి ప్రత్యర్థులుగా..

రామన్న, శంకర్‌ల మధ్య 2012 నుంచి విభేదాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా ఉన్న రామన్న తెదేపాను వీడి నాగం జనార్దన్‌రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిలో చేరారు. పాయల్‌ శంకర్‌ ఆయన వెంట వెళ్లకుండా తెదేపాలోనే కొనసాగారు. అనంతరం జోగురామన్న తెరాస (భారాస)లో చేరి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012 మార్చిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో తెదేపా ఆయనకు ప్రత్యర్థిగా పాయల్‌ శంకర్‌కు టికెట్‌ ఇచ్చి రంగంలోకి దించింది. అప్పటి నుంచి ఇరువురి ప్రత్యర్థులుగా మారారు. 2014లో జోగు రామన్న తెరాస(భారాస) తరఫున పోటీచేయగా పాయల్‌ శంకర్‌ భాజపా నుంచి బరిలోకి దిగి ద్వితీయ స్థానంలో నిలిచారు. మళ్లీ 2018లోనూ ఇరువురు తలపడగా.. జోగు రామన్న గెలుపొంది మంత్రి పదవి దక్కించుకొన్నారు.  తాజాగా నాలుగోసారి ఇద్దరూ బరిలోకి దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img