icon icon icon
icon icon icon

Sircilla: సిరిసిల్లలో పాత కథ పునరావృతం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉండేది. 2014 ముందు వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వేర్వేరుగా ఉండేవి.

Updated : 06 Dec 2023 07:08 IST

ప్రభుత్వం ఒకటైతే.. స్థానిక ఎమ్మెల్యే మరో పార్టీ

సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్‌ ప్రాంతం

న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉండేది. 2014 ముందు వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వేర్వేరుగా ఉండేవి. దీంతో అభివృద్ధిలో వెనుకబడిపోయామన్న భావన స్థానికంగా ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరవాత ఆ ఆనవాయితీ మారలేదు. ఆ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా సిరిసిల్లలో కేటీఆర్‌ గెలుపొందగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2014లో రాష్ట్ర ఏర్పాటు తరవాత పరిస్థితి మారింది. వరుసగా రెండుసార్లు తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగా.. కేటీఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు మంత్రిగానూ కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సిరిసిల్ల నుంచి వరుసగా నాలుగోసారి కేటీఆర్‌ విజయం సాధించినా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పాత ఆనవాయితీ కొనసాగినట్లయింది.

అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్ష

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అప్పటి నుంచి తెరాస (ప్రస్తుతం భారాస) అధికారంలో ఉండటం, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కె.తారక రామారావు కొనసాగడంతో నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు కావడం, పైగా మంత్రిగా కొనసాగుతూ గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టారు. జిల్లాగా మార్చడంతోపాటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే గుర్తింపు వచ్చేవిధంగా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా కేటీఆర్‌ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. దీంతో వచ్చే అయిదేళ్లలో సిరిసిల్లలో అభివృద్ధి మునుపటిలా సాగుతుందా అని స్థానికుల్లో చర్చ బయలుదేరింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అభివృద్ధిని కొనసాగించాలని, సంక్షేమం దరిచేర్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img