icon icon icon
icon icon icon

Harish Rao: అమరుల వీరుల స్తూపం వద్దకు వచ్చా.. రేవంత్‌ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: హరీశ్‌రావు

హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్‌ మోసగించిందని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు విమర్శించారు.

Updated : 26 Apr 2024 13:31 IST

హైదరాబాద్‌: హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండు పేపర్లు, సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. 

‘‘నా ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరగడమే ముఖ్యం. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్‌. సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించి గన్‌పార్కు వద్దకు వచ్చాను. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన ఇక్కడికి రావాలి. మేధావుల చేతిలో నా రాజీనామా పత్రాన్ని పెడుతున్నా. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్‌ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ఆరుగ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు ఇవ్వండి. ఉప ఎన్నికలో కూడా పోటీ చేయను. ఒకవేళ వీటిని అమలు చేయలేకపోతే తన రాజీనామాను గవర్నర్‌కు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా? అమరుల స్తూపం వద్దకు రావడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నట్లే. రాజకీయాల కంటే పేదల ప్రయోజనాలే మాకు ముఖ్యం. వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ రావాలి. రైతులకు రూ.15 వేల రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ, వరికి రూ.500 బోనస్‌, మహిళలకు రూ.2,500 అందించాలి. డిసెంబర్‌ 9న తొలి సంతకం ఆరు గ్యారంటీలు, రుణమాఫీపై పెడతామని చెప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img