icon icon icon
icon icon icon

choutalas: ఆ ‘న‌లుగురు’.. తావు వార‌సులే అంటున్నారు..

హరియాణాలోని హిసార్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పక్షాల అభ్యర్థులు తాము దేవీలాల్‌ ఆశయాలను ముందుకు తీసుకెళుతామని ప్రచారం నిర్వహించడం విశేషం.

Updated : 06 May 2024 14:27 IST

సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు పేరొందిన హ‌రియాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు వేడిపుట్టిస్తున్నాయి. దాదాపు మూడు ద‌శాబ్దాల‌పాటు హ‌రియాణా రాజ‌కీయాల‌ను శాసించిన లాల్ త్ర‌యం ప్ర‌స్తుతం లేక‌పోయినా వారి పేరుపై రాజ‌కీయాలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. దేవిలాల్‌, బ‌న్సీలాల్‌, భ‌జ‌న్‌లాల్‌లు రాష్ట్ర రాజ‌కీయాల‌పై చెర‌గ‌ని ముద్ర‌వేశారు. వీరిలో చౌద‌రి దేవిలాల్ దేశ ఉప ప్ర‌ధానిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో హిసార్ లోక్‌స‌భ స్థానంలో బ‌రిలో ఉన్న న‌లుగురు తాము తావు వార‌సులే పేర్కొన‌డం విశేషం. తావు అంటే పెద్ద అని అర్థం. రైతుల‌కు, జాట్ స‌మాజానికి పెద్ద‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ఆయన లేక‌పోయినా ఇప్ప‌టికీ దేవీలాల్ పేరుతో ఓట్లు అడ‌గ‌టం విశేషం.

న‌లుగురు అభ్య‌ర్థుల్లో ముగ్గురు చౌటాలాలు..

గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన భాజ‌పా ఎంపీ బ్రిజేంద్ర‌సింగ్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. భాజ‌పా నుంచి రంజిత్ చౌటాలా బ‌రిలో నిలిచారు. ఈయ‌న దేవీలాల్ కుమారుడు.  దేవీలాల్ మ‌న‌వ‌డు దుష్యంత్ చౌటాలా పార్టీ జేజేపీ నుంచి దుష్యంత్ త‌ల్లి నైనా సింగ్ చౌటాలా,  ఐన్ఎల్‌డీ నుంచి  దేవిలాల్ మ‌న‌వ‌డు ర‌విచౌటాల స‌తీమ‌ణి సున‌య‌న చౌటాలా బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జ‌య‌ప్ర‌కాశ్ పోటీలో నిలిచారు.

అంద‌రి బంధువు దేవీలాల్‌

పోటీలో ఉన్న బీజేపీ, జేజేపీ, ఐఎన్ఎల్‌డీ అభ్య‌ర్థులు దేవీలాల్ బంధువ‌ర్గం కావ‌డం విశేషం. కాంగ్రెస్ అభ్య‌ర్థి జ‌య‌ప్ర‌కాశ్ సైతం తావు సాబ్ ఉన్న స‌మ‌యంలోనే రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన అంశాన్ని గుర్తు చేస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో భాజ‌పా త‌ర‌ఫున పోటీచేసిన బ్రిజేంద్ర‌సింగ్‌ 3 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే విజ‌య‌మ‌ని భాజ‌పా ఆశిస్తోంది. 

2019 ఫ‌లితాలే తిరిగి వ‌స్తాయా?

గ‌త ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌స‌భ సీట్ల‌ను భాజపా గెలుచుకుంది. ఈ ఎన్నిక‌ల్లోనూ అదే రికార్డు కొన‌సాగించాల‌ని క‌మ‌ల‌ద‌ళం ప‌ట్టుద‌ల‌తో ఉంది. రాష్ట్రంలో కీల‌క‌శ‌క్తిగా ఉన్న జాట్ ఓట్లు ఐఎన్ఎల్‌డీ, జేజేపీ మ‌ధ్య‌చీలిపోయే అవ‌కాశ‌ముంది. దీంతో త‌మ  విజ‌యంపై భాజ‌పా ఆశ‌లు పెట్టుకుంది. 

-ఇంట‌ర్నెట్ డెస్క్ ప్ర‌త్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img