icon icon icon
icon icon icon

PM Modi: అప్పుడు భారాస.. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయి: ప్రధాని మోదీ

గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, మేం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు.

Published : 10 May 2024 16:51 IST

నారాయణపేట: గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో భారాస ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటున్నాయని ఆరోపించారు. భారాస సర్కారు.. కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా భారాస దారిలోనే వెళ్తోందని  ని విమర్శించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. తాను ఎవరి పేరూ చెప్పకపోయినప్పటికీ.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారని, దీనిని బట్టి ఆ ట్యాక్స్‌ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. 

‘నా పాలమూరు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా’ అంటూ తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో కష్టాలకు ఓర్చి తనను ఆశీర్వదించేందుకు వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ మోదీ గ్యారంటీ అంటే.. దేశ అభివృద్ధికి గ్యారంటీ, విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, ఇచ్చిన హామీలు నెరవేరతాయన్న గ్యారంటీ. మహబూబ్‌నగర్‌ ప్రాంతాన్ని భారాస, కాంగ్రెస్‌ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. 

కాంగ్రెస్‌ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేష విషం చిమ్ముతున్నారు. ఆయన రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారు. శరీర రంగును బట్టి దక్షిణ భారత్‌ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడారు. కాంగ్రెస్‌కు హిందువులు, వారి పండుగలు అంటే ఇష్టం లేదు. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది. కులాలు, మతాల పేరిట దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను అంబేడ్కర్‌ కూడా వ్యతిరేకించారు. అలాంటి రిజర్వేషన్లు ఇస్తే.. మతమార్పిడులు పెరుగుతాయి. కాంగ్రెస్‌ అంటే అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, భారాస కుమ్మక్కయ్యాయి’’ అని మోదీ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img