icon icon icon
icon icon icon

Rahul Gandhi: మోదీ ధనికులకు ఇచ్చిన డబ్బును.. పేదల ఖాతాల్లో వేస్తాం: రాహుల్‌

ప్రస్తుత ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Published : 09 May 2024 19:45 IST

హైదరాబాద్‌: ప్రస్తుత ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఓ వర్గం రాజ్యాంగాన్ని రక్షించాలనుకుంటుంటే.. మరో సమూహం రాజ్యాంగం అవసరం లేదు, రద్దు చేస్తామని చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ జనజాతర సభలో రాహుల్‌ ప్రసంగించారు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు.. ఇలా అన్నీ రాజ్యాంగం ద్వారానే వచ్చాయని,  అలాంటి రాజ్యాంగంతోపాటు రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోందని ఆరోపించారు.

‘‘ మహామహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారు. ఎంతో గొప్పదైన మన రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తున్నారు. మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారు. వారికి రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి రాష్ట్రంలో పేదల వివరాలు సేకరిస్తుంది. పేదల జాబితా తయారు చేసి,  ప్రతి కుటుంబంలోని మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం. 

పదేళ్లలో మోదీ ధనికులకు రూ.లక్షల కోట్లు దోచి పెట్టారు. ధనికులకు ఇచ్చిన డబ్బును మేం పేద మహిళల ఖాతాల్లో వేస్తాం. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, మద్దతు ధర అనే రెండు ప్రధాన హామీలు ఉన్నాయి. పట్టభద్రులు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతోపాటు నైపుణ్య శిక్షణ ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.8,500 శిక్షణ భృతి అందిస్తాం. ఉపాధి హామీ పథకంలో ఇచ్చే రోజువారీ కూలీని రూ.400కు పెంచుతాం’’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img