icon icon icon
icon icon icon

Revanth Reddy: ఫైనల్స్‌లో భాజపాను ఓడించి.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం: రేవంత్‌రెడ్డి

ఇండియా కూటమిలో కేసీఆర్‌ను చేర్చుకునేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 30 Apr 2024 21:30 IST

హైదరాబాద్‌: ఇండియా కూటమిలో కేసీఆర్‌ను చేర్చుకునేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్ధతుగా మంగళవారం రాత్రి బడంగ్‌పేటలో నిర్వహించిన రోడ్‌ షోలో సీఎం ప్రసంగించారు. భారాస హయాంలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా తట్టుకుని నిలబడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని కొనియాడారు. భారాస కారు కార్ఖానాకు పోయింది.. ఇక తిరిగి రాదు తూకానికి వేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌లో భారాసను ఓడించి ఫైనల్స్‌కు వచ్చామని, ఫైనల్స్‌లో భాజపాను ఓడించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

‘‘కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. 12 ఎంపీ సీట్లు గెలిస్తే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్‌ చెబుతున్నారు. ఎవరి చెవిలో పువ్వు పెడతారు? ఇండియా కూటమి నేతలు.. కారును దగ్గరకు కూడా రానీయరు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయబోతున్నాం. భాజపాతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్‌ ఏం చేశారో చెప్పకుండా.. మనం ఏం చేయట్లేదని అంటున్నారు. కేసీఆర్‌ జీవితంలో పదవి అనేది ఇక లేదు. సబితా ఇంద్రారెడ్డి ఉదయం కారు గుర్తు అంటున్నారు.. సాయంత్రం కమలం గుర్తు అంటున్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను ప్రధాని మోదీ రద్దు చేస్తే.. వద్దని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎందుకు చెప్పలేదు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img