icon icon icon
icon icon icon

Revanth Reddy: భాజపాను డకౌట్‌ చేసి.. గుజరాత్‌ను ఓడించాలి: రేవంత్‌

రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Published : 07 May 2024 20:46 IST

హనుమకొండ: రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఓటమి తర్వాత అయినా కేసీఆర్‌లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని అన్నారు. కానీ, ఆయనలో మార్పు రాలేదు సరికదా.. ఈ ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారని మండిపడ్డారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

‘‘ సీఎం కుర్చీ నుంచి దిగిపోవడానికి నేను అల్లాటప్పాగా రాలేదు. ఉద్యమం పేరిట అమాయకులైన పిల్లన్ని చంపి పదవిలోకి రాలేదు. నిరంకుశ ప్రభుత్వంపై పదేళ్లు పోరాడి సీఎం కుర్చీలో కూర్చున్నా. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ దిగిపోవాలని కేసీఆర్‌ ఎందుకు అనడం లేదు. కుమార్తె బెయిల్‌ కోసం ఎంపీ సీట్లను ఆయన మోదీకి తాకట్టుపెట్టారు. ఈ ఎన్నికలు తెలంగాణ - గుజరాత్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ లాంటివి. భాజపాను డకౌట్‌ చేసి.. గుజరాత్‌ను ఓడించాలి.

విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చింది. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో పెట్టారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. విభజనచట్టంలోని పరిశ్రమలు, ప్రాజెక్టులను మోదీ సర్కారు రద్దు చేసింది. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలించారు. మోదీ గుజరాత్‌కు మాత్రమే ప్రధానా? దేశం మొత్తానికా?ఈ పదేళ్లలో తెలంగాణకు మోదీ గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారు’’ అని రేవంత్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img