icon icon icon
icon icon icon

Shivraj Singh Chouhan: 20 ఏళ్ల తర్వాత పోటీ.. దిల్లీలో కీలక పదవిపై కన్ను..!

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గతంలో ఆయన ఇక్కడినుంచి ఐదుసార్లు గెలుపొందారు.

Published : 02 May 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈసారి లోక్‌సభ బరిలోకి దిగారు. 20 ఏళ్ల తర్వాత తన సొంత నియోజకవర్గం విదిశాలో పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి భాజపా తరపున ఐదుసార్లు ఎన్నికైన ఆయన ప్రచారంలో జోరు పెంచారు. పత్రిఒక్కరినీ పలకరిస్తూ.. ఎంతో ఉత్సాహంగా ముందుకుసాగుతున్నారు.

ఇక్కడి నుంచి గెలిచి దిల్లీలో కీలక బాధ్యతలు చేపట్టాలని శివరాజ్‌ సింగ్‌ భావిస్తున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో భాజపా ఘన విజయం సాధించినప్పటికీ పార్టీ అధిష్ఠానం.. మోహన్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. దీంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా..? అని అడిగితే.. ‘తన కోసం ఏదైనా అడగడం కంటే.. చావే మేలు’ అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. విదిశా స్థానం నుంచి పేరును ప్రకటించేంతవరకూ ఆయన రాజకీయ భవితవ్యం సందిగ్ధంలోనే ఉంది. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా దిల్లీ రాజకీయాలపైనే ఉంది.

గతనెల 24న ప్రధాని మోదీ హర్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి చౌహాన్‌ను కొనియాడారు. ‘ఆయనతో కలిసి పని చేయడానికి మరోసారి దిల్లీకి తీసుకెళ్తాను’ అని ప్రధాని కూడా ఆయనకు అభయం ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై చౌహాన్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ దిల్లీకి వెళ్లనని చెప్పలేదు. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా.. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏమీ కోల్పోలేదు. నా కొత్త రోల్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

విదిశా లోక్‌సభ స్థానం భాజపాకు కంచుకోట. ఈ నియోజకవర్గం ఏర్పడిన 1967 నుంచి ఇప్పటివరకూ రెండుసార్లు మాత్రమే ఓడిపోయింది. ఇక్కడినుంచి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, సుష్మాస్వరాజ్‌ లాంటి దిగ్గజ నేతలు గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందాలని శివరాజ్‌ సింగ్‌ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మూడో దశలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img