Iphone : ఐ ఫోన్‌లోకి వైరస్‌.. ఎలా అడ్డుకోవాలంటే!

సాంకేతిక  (Technology)నిపుణుల పరిశోధన ప్రకారం ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోలిస్తే ఐ ఫోన్లు (IPhones)చాలా సురక్షితమైనది. అయినప్పటికీ సరైన జాగ్రత్తలు పాటించపోతే వాటిలోకి కూడా వైరస్‌లు (Viruses) ప్రవేశించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Updated : 14 May 2023 15:03 IST

ఆండ్రాయిడ్‌ (Android) ఫోన్లతో పోలిస్తే ఐ ఫోన్లలో (IPhones) భద్రతా ప్రమాణాలు ఎక్కువే అయినప్పటికీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వాటికి కూడా వైరస్‌ (Viruse)వస్తుంది. అయితే అది చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ (Software) అప్‌డేట్‌ చేసుకోకపోవడం, కొన్ని రకాల వెబ్‌సైట్‌లు (Websites), మెయిళ్లను (Mails) తెరవడం వల్ల ఐ ఫోన్లలోకి వైరస్‌లు చొరబడుతుంటాయి.

ఎక్కువగా సోకే వైరస్‌లివే!

ఐఫోన్‌కు ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా ఎక్కువ మంది హ్యాకర్లు దాన్ని హ్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అవి హ్యాకింగ్‌కు గురి కానప్పటికీ కొన్ని రకాల వైరస్‌ల బారి నుంచి తప్పించుకోలేవు. ఐ ఫోన్లలోకి మాల్వేర్‌, ట్రోజాన్‌, ర్యాన్సమ్‌వేర్ వంటి వైరస్‌లు ప్రవేశిస్తుంటాయి. మాల్వేర్‌ అనేది ఒకరకమైన హానికారక వైరస్‌. ఫోన్లలో, కంప్యూటర్లలో ప్రవేశిస్తుంది. అది వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, డివైజ్‌ను దెబ్బతీయడం వంటి పనులు చేస్తుంది. ట్రోజాన్‌ వైరస్‌ను ట్రోజాన్‌ హార్సెస్‌ అని కూడా పిలుస్తారు. ఇవి హిడెన్‌ ఫైల్స్‌లా ఉంటూ డివైజ్‌కు హాని చేస్తాయి. యూజర్‌కు తెలియకుండానే సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేయడానికి సహాయపడుతాయి. ర్యాన్సమ్‌ అనేది మరో ప్రమాదకరమైన వైరస్‌. దీన్ని యూజర్ల డివైజ్‌లలోకి చొప్పించి హ్యాకర్లు వాటిని పని చేయకుండా చేస్తారు. అడిగిన మొత్తంలో నగదు లేదా క్రిప్టో కరెన్సీ చెల్లిస్తే తప్ప వాటిని డీక్రిప్ట్‌ చేయరు. అందుకే ఐ ఫోన్లలో తప్పనిసరిగా యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి.

వైరస్‌ బారిన పడిన ఫోన్‌ ఇలా ఉండొచ్చు!

 • ఎక్కువగా వేడి అవుతుంది. సీపీయూ, మెమొరీని హానికారక వైరస్‌లు ఎక్కువగా వినియోగించడం మూలంగా ఇలా జరుగుతుంటుంది.
 • ఫోన్‌ అవసరానికి మించి ఎక్కువ డేటాను వినియోగిస్తుంటుంది. ఫోన్‌ ఉపయోగించకపోయినా డేటా ఖర్చయిపోతుంటే కచ్చితంగా అనుమానించాలి. ఫోన్‌ సెట్టింగ్‌లోకి వెళ్తే ఏ యాప్‌ ఎంత డేటా వాడుతుందో తెలిసిపోతుంది. దాంతో ఒక అవగాహనకు రావచ్చు.
 • కొన్నిసార్లు ఏ బ్రౌజర్‌ ఓపెన్‌ చేయకపోయినా పాప్‌ అప్స్‌ వస్తుంటాయి. క్రోమ్‌, సఫారీ వంటివి వాడకపోయినా పాప్‌ అప్స్‌ తరచూ వస్తున్నాయంటే అది వైరస్‌కు సంకేతంగా భావించాలి.
 • అపరిచిత యాప్‌లు ఏవైనా డౌన్‌లోడ్ అయ్యాయేమో చెక్‌ చేసుకోవాలి. మనకు తెలియకుండానే ఏదైనా యాప్‌ వచ్చిపడిందంటే మాల్వేర్‌ ప్రమేయం ఉన్నట్లే.
 • డివైజ్‌లో మాల్వేర్‌లు ప్రవేశించినట్లయితే మిగతా యాప్‌లు తరచూ క్రాష్‌ అవుతుంటాయి.
 • వైరస్‌లు డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేయడం, మరిన్ని వైరస్‌లను బ్యాకెండ్‌లోకి పంపించడం మూలంగా బ్యాటరీ ఎక్కువగా ఖర్చయిపోతుంటుంది.

వైరస్‌ రాకుండా నివారించే మార్గాలివి!

కంప్యూటర్లకు హాని చేసే వైరస్‌లు, మాల్వేర్‌లు ఐ ఫోన్‌లోకి కూడా ప్రవేశిస్తాయని చాలా మంది యూజర్లకు తెలియదు. గతంలో నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రతి ఐదు ఐ ఫోన్లలో ఒకటి వైరస్‌ బారిన పడినట్లు తేలింది. ఎలాంటి వైరస్‌కైనా అడ్డుకట్ట వేసే మార్గం లేకపోయినప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. 
 

 • ఆపరేటింగ్ సిస్టమ్‌ను తరచూ అప్‌డేట్‌ చేసుకోవాలి.
 • బ్రౌజర్‌లలో కుకీస్‌లను ఆఫ్‌ చేయాలి.
 • అవసరం లేకుంటే బ్లూటూత్‌ ఆప్షన్‌ను ఆఫ్‌లో పెట్టాలి.
 • పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను వినియోగించే సమయంలో నమ్మకమైన ‘వీపీఎన్‌’ను వినియోగించాలి.
 • వీలయినంత వరకు మొబైల్‌ డేటాను మాత్రమే వాడాలి. అత్యవసరమైతే తప్ప పబ్లిక్‌ వైఫై జోలికి పోవద్దు.
 • పబ్లిక్ వైఫై వాడుతుంటే హెచ్‌టీటీపీఎస్‌ ద్వారా మాత్రమే వెబ్‌సైట్లను తెరవాలి.
 • సెట్టింగ్స్‌లో ఆటోమేటిక్‌ వైఫై కనెక్ట్ ఆప్షన్‌ను తొలగించాలి.
 • ‘జైల్‌ బ్రేకింగ్’ అంటే తయారీదారు పెట్టిన సాఫ్ట్‌వేర్‌ నిబంధనలను తొలగించొద్దు.
 • అనవసర ప్రకటనలు, ఈ మెయిళ్లు, లింక్‌లు, సందేశాలు క్లిక్ చేయకూడదు.
 • నిషేధిత, అనుమానాస్పద వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లొద్దు.
 • అలాగే యాప్‌ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. యాప్‌ స్టోర్‌లో ఉన్న వాటిని మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం.
 • ఈ పనులతో పాటు సెక్యురిటీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఉచితం, సబ్‌స్క్రిప్షన్‌లతో అవి అందుబాటులో ఉంటాయి. అవాస్ట్‌, నొర్టన్‌, బిట్‌డిఫెండర్‌ వంటి సెక్యురిటీ యాప్‌లు ఎక్కువ రక్షణ కల్పిస్తాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు