Polar Bear Jail : ధ్రువపు ఎలుగుబంట్ల జైలు.. అందులో వేస్తే సత్ప్రవర్తన ఖాయం!
‘పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా కెనడా(Canada)లోని చర్చిల్ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ నివాసాలపై దాడికి యత్నించే ధ్రువపు ఎలుగుబంట్ల(Polar Bear)ను బంధించడానికి ఓ ప్రత్యేకమైన జైలు(Jail)ను ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో చదివేయండి.
కెనడా(Canada)లోని చర్చిల్‌కు చెందిన వన్యప్రాణి సంరక్షణ అధికారికి ఉదయాన్నే ఓ ఫోన్(Phone) కాల్ వచ్చింది. పట్టణంలో ధ్రువపు ఎలుగుబంటి(Polar Bear) సంచరిస్తోందని, దాన్ని బంధించాలని అవతలి వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంటనే తన బృందంతో రంగంలోకి దిగిన ఆ అధికారి ధ్రువపు ఎలుగుబంటి ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆహారం దొరక్కపోవడంతో ఆ ఎలుగుబంటి కోపంతో ఇంటి కిటికీని బలంగా బాదుతోంది. దాంతో మత్తు తూటా అమర్చిన గన్(Gun)తో దాన్ని షూట్ చేశారు. అప్పటి వరకు బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి కాస్త మెత్తబడింది. మత్తు ప్రభావంతో ఓ చోట కుప్పకూలింది. వెంటనే అధికారులు వలలో దాన్ని బంధించి ‘పోలార్ బేర్ జైలు’కు తరలించారు.
దాడి చేస్తే కాల్చేసేవారు!
గతంలో చర్చిల్‌లో ధ్రువపు ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేయడానికి యత్నిస్తే వాటిని కాల్చి చంపేవారు. ఆహారం(Food) కోసం నివాసాల మధ్యలోకి వచ్చి అవి తూటాలకు బలయ్యేవి. కొన్నిసార్లు ఎలుగుబంట్లు దాడి చేయడంతో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 1982లో తొలిసారి వాటిని బంధించడం మొదలుపెట్టారు. ‘హౌస్ డి-20’ పేరుతో ఉన్న భవనంలోకి ఎలుగుబంట్లను తరలించేవారు. ఈ భవనాన్ని గతంలో మిలటరీ అధికారులు శవాగారంలా ఉపయోగించేవారు. కాలక్రమంలో ఇదే ‘పోలార్ బేర్ జైల్’గా మారింది. అధికారికంగా దీన్ని ‘పోలార్ బేర్ హోల్డింగ్ ఫెసిలిటీ’గా పిలుస్తుంటారు. తొలుత ఈ జైలులో 20 సెల్స్ ఉండేవి. తరువాత అవసరాలు పెరగడంతో 28కి విస్తరించారు.
బంధిస్తే ఏమవుతుంది?
జైలు గదుల్లో రెండు ధ్రువపు ఎలుగుబంట్లను ఒక చోట కలిపి ఉంచితే అవి ఘర్షణకు దిగుతాయట. అందుకే విడివిడిగానే సెల్లో ఉంచుతారు. సాధారణంగా 2 నుంచి 30 రోజులపాటు ధ్రువపు ఎలుగుబంట్లను సెల్స్‌లోనే బంధిస్తారు. ఆ సమయంలో వాటి ప్రవర్తనలో మార్పును నిశితంగా గమనిస్తారు. ఒక చోట బంధించడం వల్ల ఎలుగుబంట్లు తాము జనావాసాల్లోకి వెళితే చిక్కుల్లో పడతామనే భావనకు వస్తాయి. వాటికి అవసరం మేరకు నీరు తప్ప ఆహారం కూడా ఇవ్వరు. ఎందుకంటే సహజంగానే ధ్రువపు ఎలుగుబంట్లకు ఆహారం లేకుండా కొన్ని నెలలపాటు జీవించగలిగే శక్తి ఉంటుంది. పైగా ఆహారం, నీరు ఇవ్వడం మొదలుపెడితే అవి జైలు వాతావరణానికి అలవాటుపడిపోతాయి. జైలు జీవితం పట్ల విరక్తి చెందిన ఎలుగుబంట్లు గోడలకు ఆనుకొని దీనంగా కూర్చుండిపోతాయి. ఎలుగుబంట్లకు ఆ శిక్ష సరిపోతుందని భావిస్తే వాటిని తిరిగి మంచు ప్రదేశంలో వదిలివేస్తారు. హుడ్సన్ బేలో సాధారణంగా వేసవి కాలంలో మంచు కరిగిపోతుంది. చలికాలంలో మంచు గడ్డకట్టడం మొదలవుతుంది. అందుకే చలికాలం మొదలుకాగానే వాటికి మత్తుమందు ఇచ్చి హెలికాప్టర్లలో తీసుకెళ్లి మంచు ప్రదేశాల్లో వదిలిపెడతారు.
మంచు కరిగి.. ఆహారం కరవు!
ప్రపంచంలో దాదాపు 31 వేల ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నట్లు ఒక అంచనా. కెనడాలోని చర్చిల్‌లో 850 నివాసాలున్నాయి. ఈ పట్టణానికి సమీపంలో ‘హడ్సన్ బే’లోనూ దాదాపు 900లకు పైగా ధ్రువపు ఎలుగుబంట్లు జీవిస్తున్నాయి. ఈ ధ్రువపు ఎలుగుబంట్లను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. చలికాలంలో మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో అవి సీల్స్‌ను వేటాడుతాయి. జులైలో మంచు కరగడం ప్రారంభం కాగానే మంచును విడిచి ధ్రువపు ఎలుగుబంట్లు నేలపైకి వెళ్లిపోతాయి. దాంతో వాటికి ఆహారం కరవవుతుంది.
అప్పటికే గతంలో తిన్న ఆహారాన్ని శరీరంలో కొవ్వుగా మార్చుకొని ఉంటాయి. ఆ కొవ్వు సహాయంతో కొన్ని నెలలపాటు ఆహారం లేకుండానే మనుగడ సాగించగలుగుతాయి. కొన్నిసార్లు మాత్రం ఆహారాన్వేషణలో భాగంగా జనావాసాల్లో వెళ్లే ప్రయత్నం చేస్తాయి. కెనడా అధికారిక లెక్కల ప్రకారం ధ్రువపు ఎలుగుబంట్ల జనాభా గత ఐదేళ్లలో 27 శాతం తగ్గింది. ప్రతి సంవత్సరం మంచు తగ్గడం మూలంగా ధ్రువపు ఎలుగుబంట్ల వేటకు కావాల్సినన్ని సీల్స్ దొరకడం లేదు. దాంతో అవి కొవ్వును దాచుకోవడం గగనమైపోయినట్లు సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై