Coral Reefs : ప్రమాదంలో పగడపు దీవులు.. మేలుకోకపోతే అంతమే!

వివిధ వర్ణాల్లో కనువిందు చేసే అందమైన పగడపు దీవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి.

Updated : 04 Mar 2023 13:10 IST

ఈ ప్రపంచంలోని ఎన్నో అద్భుతాల్లో పగడపు దీవులు కూడా ఒకటి. మానవాళికి, సముద్ర జీవులకు మేలు చేస్తూ ఇవి వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి. అసలు పగడపు దిబ్బలు ఎలా ఏర్పడతాయి? అవి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి..

ఏమిటీ పగడపు దీవులు?

సముద్ర తీరాల్లో అందమైన పగడపు దిబ్బలంటాయి(Coral Reefs). రంగు రంగుల్లో ఉన్న వాటిని చూడగానే రాళ్లుగా భావిస్తాము. నిజానికి అవి రాళ్లు కావు. పాలిప్స్‌ అనే జీవులు. జూజాంతలీ(Zooxanthellae)గా పిలిచే అల్గే(algae) పాలిప్స్‌ సమూహాలకు అతుక్కొని వాటికి కావాల్సిన కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis), పోషకాలను అందిస్తాయి. దాంతో పగడపు దిబ్బలు రంగు సంతరించుకుంటాయి. పాలిప్స్‌, అల్గేలు సహజీవనం సాగిస్తుంటాయి. పగడపు దిబ్బలు సమూహంతో పగడపు దీవి ఏర్పడాలంటే ఆ ప్రక్రియ ఒక రోజులో జరిగేది కాదు. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.  ప్రస్తుతం పెరుగుతున్న భూతాపం, కాలుష్యం కారణంగా జూజాంతలీ.. పాలిప్స్‌ను విడిచి వెళ్తోందట. దాంతో పగడపు దిబ్బలు రంగు కోల్పోతున్నాయి. క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. భూతాపం, కాలుష్యం తగ్గించడానికి మానవులు ప్రయత్నిస్తే మళ్లీ పగడపు దీవులు పునరుజ్జీవం పోసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఎందుకంత ప్రత్యేకం?

దాదాపు వందకుపైగా దేశాల్లో పగడపు దీవులున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై కనిపించే వాటిలో పగడపు దీవులు కూడా ఉంటాయి. అంతటి ప్రత్యేకత వీటికి ఉంది. గడిచిన మూడు దశాబ్దాల్లో నీటిలోపల ఉండే పగడపు దీవుల్లో సగం మాయమైపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్దం మధ్య కల్లా అది 90 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద గ్రేట్ బారియర్‌ రీఫ్‌(Great Barrier Reef)పై ఇప్పటికే వాతావరణంలోని మార్పుల ప్రభావం కనిపిస్తోంది.

పగడపు దిబ్బలు లేకుండా బతకలేమా?

ప్రకృతి వేటినీ అనవసరంగా సృష్టించదు. సృష్టిలో చాలా వరకు మానవులకు మేలు చేస్తున్నాయే కానీ, కీడు చేయట్లేదు. అలా పగడపు దిబ్బలు కూడా మానవులకు మంచి చేస్తున్నాయి. సముద్రంలోని బలమైన అలలు, తుపానులు(storm) వచ్చినప్పుడు తీర ప్రాంతాలు ప్రభావితం కాకుండా 97శాతం తరంగ శక్తికి(wave energy) పగడపు దిబ్బలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఫలితంగా తుపానుల తీవ్రత తగ్గుతోంది. తీరం కోతకు గురి కాకుండా ఉంటోంది. దాంతో పరోక్షంగా దాదాపు 20 కోట్ల మంది జనాభాను ఇవి రక్షిస్తున్నాయి. అమెరికాకు చెందిన భూగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 1.8లక్షల కోట్ల డాలర్ల(dollar) నష్టాన్ని పగడపు దీవులు తగ్గిస్తున్నాయి. ఫ్లోరిడా, హవాయ్‌, ప్యూర్టోరికో వంటి ప్రసిద్ధ నగరాల మనుగడ పగడపు దీవుల చలువేనని చెప్పవచ్చు. పగడపు దిబ్బలు 1 మీటరు ఎత్తు తగ్గితే దాదాపు 5 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక మానవులకు అవసరమైన ప్రాణాధార ఔషధాలు(medicine) చాలా వరకు సముద్ర జీవుల నుంచి సేకరించిన పదార్థాల నుంచి తయారవుతున్నాయి. పగడపు దీవులు లేని చోట ఆ సముద్ర జీవులు బతుకు సాగించలేవు. దాంతో మార్కెట్లో దొరకుతున్న రకరకాల మందులు, ప్రాణాంతక వ్యాధుల్ని కట్టడి చేసే ఔషధాలు సమీప భవిష్యత్తులో లభించకుండా పోయే ప్రమాదం ఉంది. మానవులు ఏటా 150 మిలియన్‌ టన్నులు చేపలను(fish) తింటున్నారు. దాంతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఒమెగా లాంటివన్నీ సమృద్ధిగా పొందుతున్నారు. సముద్ర జీవులు అంతరించిపోతే ఇక ప్రతి మనిషి రోగాలతో రొప్పుతూ ఉండాల్సిందే. పగడపు దిబ్బలున్న చోట పర్యాటకం కూడా వృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలకు పగడపు దీవుల ఆధారంగా ఆదాయం లభిస్తోంది. ఆస్ట్రేలియాలోని గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ను సందర్శించడానికి ఏటా లక్షల మంది పర్యాటకులు వెళ్తుంటారు. మన దేశంలో గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ మయన్మార్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌, లక్షదీవుల్లో పగడపు దిబ్బలున్నాయి. కేరళ(kerala), తమిళనాడు, పాండిచ్చేరి తీరాల్లోనూ అక్కడక్కడా పగడపు దిబ్బలు కనిపిస్తాయి. వాటిని కాపాడటానికి భారత ప్రభుత్వం(indian government) ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చింది. పగడపు దిబ్బలున్న ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, మైనింగ్‌ వంటి కార్యకలాపాలు చేయకూడదని స్పష్టం చేసింది. 

మేలు మనుషులకే కాదు!

భూమిపై 0.5శాతం లోపే పగడపు దిబ్బలున్నాయి. కానీ, సముద్రపు జీవుల్లో 25 శాతం అక్కడే తలదాచుకుంటున్నాయి. మనం అక్వేరియాల్లో చూస్తున్న రంగురంగుల చేపలు ఇక్కడే సంచరిస్తుంటాయి.

తక్షణ కర్తవ్యం ఏమిటి? 

పగడపు దిబ్బలు ఒక్క రోజుతో పుట్టికొచ్చినవి కావు. వాటికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే మానవాళి వాటిని రక్షిస్తూ.. మనుగడ సాగించాలి. ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను(temperature) కట్టడి చేయాలి. వీలైనంత వరకు చెట్లను నాటాలి. తద్వారా భూతాపాన్ని తగ్గించాలి. క్రిమి సంహారక మందుల(pesticides) వాడకం మంచిది కాదు. వాటి తాలుకా అవశేషాలు సముద్రంలోకి చేరడంతో పగడపు దీవులు దెబ్బతింటున్నాయి. పగడపు దీవులున్న చోట భారీ ఓడల లంగర్‌ వేయకూడదు. ఇలాంటి చర్యలతో పగడపు దిబ్బలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని