Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?

హమాస్‌ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్‌ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే..

Updated : 07 Oct 2023 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఆ పట్టణాలు, గ్రామాల్లో ఇంకా తెల్లవారలేదు. అందరు ఆదమరచి నిద్రపోతున్నారు. ప్రపంచంలోనే సుశిక్షితమైన సైన్యం ఆ దేశ సరిహద్దుల్లో పహారాలో ఉంది. అయితే.. ఉన్నట్టుండి అలజడి రేగింది. వేలాది రాకెట్ల దాడులు, వందలాదిమంది హమాస్‌ (Hamas) ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌ ప్రాంతం వణికిపోయింది. ఇన్నాళ్లు దాడులే తప్ప ప్రతిదాడులు చవిచూడని ఇజ్రాయెల్‌ (Israel) ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే..

అలసత్వం, ఏమీకాదులే అన్న ధోరణి..

హమాస్‌ 2006 నుంచి ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతాలపై దాడులు చేస్తోంది. 2006లోనే ఇజ్రాయెల్‌ సైనికుడు గిలాద్‌ షకీత్‌ను ఆ సంస్థ ఐదేళ్ల పాటు తన వద్ద బందీగా ఉంచుకోవడం గమనార్హం. తొలినాళ్ల నుంచి హమాస్ సాంకేతికతపై ఆధారపడింది. ఇరాన్‌తో పాటు మరిన్ని సంస్థల నుంచి రాకెట్ల తయారీలో నైపుణ్యం పొందింది. ప్రత్యేకించి లిబియా నుంచి అనేక రాకెట్లను ఇతరులు చూడకుండా దిగుమతి చేసుకుంది. 2014లో హమాస్‌కు చెందిన అనేక సొరంగాలను ఇజ్రాయెల్‌ ఆర్మీ కనుగొని అందులో ఉన్న దాదాపు వేలాది రాకెట్లను ధ్వంసం చేసింది. హమాస్‌ కొంతకాలం పాటు క్రియాశీలకంగా ఉండటం అనంతరం స్తబ్ధుగా ఉండిపోవడంతో ఇజ్రాయెల్‌ సైనిక వర్గాలు అంతగా పట్టించుకోలేదు. మరో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ జిహాద్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. ఈ సమయంలో హమాస్‌ ఆయుధగారాన్ని పెంచుకొంది.

2014 నుంచి మారిన వ్యూహం

2014 ముందు వరకు ఏదైనా దాడి జరిగితే ఇజ్రాయెల్‌ దళాలు వెంటనే స్పందించి.. పాలస్తీనా ప్రాంతంలోకి చొచ్చుకొని వెళ్లి నిందితులను వేటాడేవి. తరువాత కాలంలో ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు మాత్రమే చేపట్టారు. దీంతో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టలేకపోయారు.

ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్‌’!

లెబనాన్‌లోని ఉగ్రవాదులకు ఇరాన్‌ సాయం కొనసాగుతోంది. ఈ సంస్థలు హమాస్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. వీటిని ఇజ్రాయెల్‌ నిఘావర్గాలు పసిగట్టలేకపోయాయి. చిన్న ఉగ్రవాద సంస్థలు దాడి చేసే స్థితిలో లేవన్న ధీమాలో ఉండిపోయారు. చివరకు ఆ నిర్లక్ష్యమే నేటి దాడులకు దారి తీసింది.

ఇనుప గుమ్మటం వైఫల్యం..

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ (Iron dome Defence System)ను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్‌ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్‌ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను హమాస్‌ ప్రయోగించింది. దీంతో కొన్నింటిని మాత్రమే ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ అడ్డుకోగలిగింది.

కలిసివచ్చిన సముద్రతీరం

గాజాకు సముద్రతీరం ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చే ఆయుధాల సరఫరాను ఇజ్రాయెల్‌ నియంత్రించినా సముద్రంపై దృష్టి సారించలేదు. దీంతో లెబనాన్‌ ఉగ్రవాదులతో పాటు తుర్కియే, ఇరాన్‌ల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు హమాస్‌కు చేరివుంటాయని రక్షణరంగ నిపుణులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని