Hamas: ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్‌’!

ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్‌’?

Updated : 07 Oct 2023 19:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 1948 నుంచి ప్రబల శక్తిగా నిలిచిన ఇజ్రాయెల్‌ (Israel)పై తొలిసారి భీకర దాడులు జరిగాయి. 1948, 1967, 1973ల్లో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయెల్‌ విజయం సాధించి యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తరువాతి కాలంలో వైరి దేశాలతో శాంతి ఒప్పందాలు కుదరడంతో పశ్చిమాసియలో శాంతి ఏర్పడింది. అయితే గత దశాబ్దకాలంగా పాలస్తీనాలోనూ ఇజ్రాయెల్‌లోనూ పెరుగుతున్న అతివాద ధోరణుల కారణంగా పరిస్థితి విషమిస్తోంది. తాజాగా పాలస్తీనాకు చెందిన హమాస్‌ (Hamas) సంస్థ ఏకంగా ఇజ్రాయెల్‌పై దాడులు చేయడం, ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌ దాడులు చేయడంతో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో హమాస్‌ ఒకటి. పాలస్తీనాలో వెస్ట్‌బ్యాంక్‌, గాజాలు ఉండగా గాజాలో హమాస్‌ బలంగా ఉంది. దీన్ని 1980ల్లో షేఖ్‌ అహ్మద్‌ యాసిన్‌ నెలకొల్పారు. 1987లో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో ఇంతిఫదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలో హమాస్‌ వెలుగులోకి వచ్చింది. 1993లో పాలస్తీనా నేత యాసర్‌ అరాఫత్‌, నాటి ఇజ్రాయెల్‌ ప్రధాని రాబిన్‌ మధ్య ఓస్లో (The Oslo Accords) ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్‌బ్యాంక్‌, గాజాల్లో పాలస్తీనా అథారిటీ పాలన ఏర్పడింది. అయితే దీన్ని హమాస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఉగ్రచర్యలకు పాల్పడటంతో 1997లో అమెరికా ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే పాలస్తీనా మండలికి జరిగిన ఎన్నికల్లో  హమాస్‌ విజయం సాధించింది.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపుదాడి.. 20 నిమిషాల్లో 5వేల రాకెట్లు..!

హమాస్‌ ఇజ్రాయెల్‌ భూభాగంపైకి దాడులు జరపడం, ప్రతిగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడటం పరిపాటిగా మారింది. 2001, 2004, 2005, 2006, 2007, 2014, 2021 సంవత్సరాల్లో ఇరు పక్షాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో వందలమంది చనిపోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడుల్లో తాజా దాడి అత్యంత తీవ్రమైనది. హమాస్‌ దాడులకు బదులుగా ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ ‘ఐరన్‌ స్వార్డ్స్‌’ను ప్రారంభించింది. హమాస్‌కు నిధులు, ఆయుధాలు ఇరాన్‌ నుంచి వస్తున్నట్టు సమాచారం. పాలస్తీనావాదులతో తుర్కియే కూడా ఆర్థిక సాయం చేస్తున్నట్టు నిఘా వర్గాల వెల్లడి.

ఇజ్రాయెల్‌ నిఘావర్గాల వైఫల్యం

సమకాలీన ప్రపంచంలో ఇజ్రాయెల్‌ నిఘావర్గాలు అత్యంత సమర్థమంతమైనవని పేర్కొంటారు. అయితే హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో అవి వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ఏకంగా ఐదువేల రాకెట్లను ప్రయోగించినట్టు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.హమాస్‌ మిలిటెంట్లు అనేకమంది ఇజ్రాయెల్‌ సైనికులతో పాటు పౌరులను కస్టడీలోకి తీసుకున్నారు.

ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

ఈ ఘర్షణలు తీవ్రమయితే పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాల అండ ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచ దేశాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇజ్రాయెల్‌- హమాస్‌ల ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగితే చమురు సరఫరాలతో పాటు కీలకమైన సూయజ్‌ జలసంధి రాకపోకలకు అడ్డంకులు తలెత్తే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు