china : ఆ ‘కూతురు ఉద్యోగం’ వెరైటీగా చేస్తోంది.. చైనాలో వింత సంఘటన!

తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి ఓ మహిళ తాను చేస్తున్న ఉద్యోగం (Job) మానేసింది. మంచిదేగా అనుకుంటున్నారా?‘ఫుల్ టైమ్‌ డాటర్‌’గా (Full time daughter) కొనసాగేందుకు ఆమె వారి దగ్గర జీతం  (Salary) తీసుకుంటోంది. చైనాలో (China) చోటు చేసుకున్న ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకోండి.  

Updated : 25 May 2023 19:11 IST

చైనాకు (China) చెందిన నియానన్‌ అనే మహిళ ఏడాది కిందట ఓ న్యూస్‌ ఏజెన్సీలో పనిచేసేది. అందువల్ల  24 గంటలూ ఆమెకు ఫోన్లు వస్తుండేవి. గత 15 ఏళ్లుగా ఆ పని చేస్తూ తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే.. అంత కన్నా మంచి ఉద్యోగం ఇస్తామని ఆమె తల్లిదండ్రులు తనకు భరోసా ఇచ్చారు. అంతే కాదు ఆర్థికంగానూ అండగా నిలబడతామని చెప్పారు. ఇంతకీ వారు ఇస్తామన్న ఉద్యోగం ఏంటో తెలుసా? ‘కూతురు ఉద్యోగం’. అవును.. మీరు చదువుతున్నది నిజమే. నియానన్‌ ఇంట్లోనే ఉంటూ తమ బాగోగులు చూసుకుంటే నెలకు 4వేల యువాన్‌లు ఇస్తామని చెప్పారు. దాంతో నియానన్‌ ఇంట్లో ఉద్యోగం చేయడానికి వెంటనే ఓకే చెప్పేసింది. ఫలితంగా ఆమెకు అద్దె ఇంట్లో ఉండాల్సిన బాధలు తప్పాయి. తిండిపై పెట్టే ఎన్నో ఖర్చులు తగ్గాయి. ఇంకా గృహోపకరణాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె ‘ఫుల్ టైమ్‌ డాటర్’గా కొనసాగుతోంది.

ఇదే ఉద్యోగ జీవితం!

నియానన్‌ ఏడాది కాలంగా ఇంటిపట్టున ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటోంది. దాని గురించి చెబుతూ ఈ కొత్త వృత్తి ‘ప్రేమతో నిండిపోయిందని’ అంటోంది. ఆమె తల్లిదండ్రులతో సూపర్‌ మార్కెట్‌కు వెళ్తోంది. వారితో కలిసి వంట చేస్తోంది. ఎక్కడికెళ్లాలన్నా తానే డ్రైవింగ్‌ చేస్తోంది. అంతే కాదు రోజూ ఓ గంటపాటు వారితో కలిసి నృత్యం చేస్తోంది. 

ఇవే కాకుండా ఇంట్లో, బయట ఉన్న ఎలక్ట్రానిక్‌ సామగ్రి నిర్వహణ చూడటం, నెలకు ఒకటి లేదా రెండు ట్రిప్‌ల విహార యాత్ర ప్లాన్‌ చేయడం కూడా ఆమె ఉద్యోగంలో ఓ భాగం. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్నప్పటికీ ఆమెకు మరింత ధనం సంపాదించాలనే ఆలోచనలు వస్తున్నాయట. వాటి గురించి ప్రస్తావిస్తే ‘నీకు ఏ పని నచ్చితే దానికే వెళ్లమని’ ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒక వేళ ఏ పనీ చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండి మాతో గడపమని చెబుతున్నారు.

జీతం ఎలా ఇస్తున్నారంటే..

వృద్ధులైన తల్లిదండ్రులు నియానన్‌కు జీతం ఎలా ఇస్తున్నారనే సందేహం చాలా మందికి ఈ పాటికే వచ్చి ఉంటుంది. వారికి నెలకు లక్ష యువాన్ల పింఛను వస్తుంది. అందులో నుంచే నియానన్‌కు 4వేల యువాన్లు చెల్లిస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు తావిచ్చింది. కొందరు ఆ మహిళ తీరును విమర్శిస్తుండగా.. మరికొందరు తల్లిదండ్రులను మెచ్చుకుంటున్నారు.

కొందరికి మోదం.. ఖేదం

‘ఇలా తల్లిదండ్రులపై ఆధారపడి బతకడాన్ని చైనీస్‌ భాషలో ‘కెన్‌ లావ్‌’ అంటారు. అయినా ‘ఫుల్‌ టైమ్‌ డాటర్‌’ అని పిలవడం ఏంటని’ ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ‘ఆ తల్లిదండ్రులు, కూతురు సంతోషంగా జీవిస్తుంటే మధ్యలో మనకెందుకు అభ్యంతరం’ అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

చైనాలో గత కొన్ని దశాబ్దాలుగా ‘996’ పని సంస్కృతి ఉంది. అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేయడం. దీంతో చాలా మంది అక్కడ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. యువత ఏకంగా పని చేయడమే మానేసి ‘లేయింగ్‌ డౌన్’ అనే సంస్కృతి వైపు మళ్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నియానన్‌ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండటం తప్పేమీ కాదని కొందరు వాదిస్తున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని