Vivek Express: వందే భారత్‌ సరే.. వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ గురించి తెలుసా?

దూర గమ్యాలను తక్కువ సమయంలో చేరుకునేందుకు వందేభారత్‌ (Vande Bharat Express) రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ దేశంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ రైలు పేరు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vivek Express). అస్సాం, తమిళనాడు మధ్య నడిచే ఈ రైలు గురించి కొన్ని ఆసక్తికర విషయాలివీ..

Updated : 16 Jan 2023 15:50 IST


(image source: Twitter)

దూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలోనే చేరుకోవడానికి భారత ప్రభుత్వం ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Vande Bharat Express) రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలును ప్రారంభించింది. సాధారణ రైళ్లలో 12 నుంచి 14 గంటల సమయం పడితే.. వందే భారత్‌లో కేవలం 8 గంటలే పడుతుంది. కానీ, 4 రోజుల ప్రయాణమున్న వివేక్‌ రైలు (Vivek Express) గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, తెలుసుకుందాం పదండి..

వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌.. భారతీయ రైల్వేలో (Indian Railways) అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు. అస్సాంలోని డిబ్రుఘడ్‌ - తమిళనాడులోని కన్యాకుమారి మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య దూరం 4,218 కిలోమీటర్లు. ప్రతి శనివారం.. డిబ్రుఘడ్‌ నుంచి మొదలై.. సుమారు 80 గంటలు (మొత్తం నాలుగు రోజులు) ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

ఈ రైలు అస్సాం, నాగాలాండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌సహా ఎనిమిది రాష్ట్రాలగుండా ప్రయాణిస్తుంది. దాదాపు 58 రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలులో ఇంజిన్‌తోపాటు 3 జనరల్‌ కోచ్‌లు, 11 స్లీపర్‌ కోచ్‌లు, నాలుగు 3టైర్‌ ఏసీ కోచ్‌లు, ఒక 2టైర్‌ ఏసీ కోచ్‌, ఒక ప్యాంట్రీ ఉన్నాయి.

ఈ రైలు గురించి 2011-12 రైల్వే బడ్జెట్‌లో అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు. 2013లో స్వామి వివేకానంద 150 జయంతి సందర్భంగా జనవరి 12న ఈ రైళ్లను పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. నిర్విరామంగా రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు సర్వీసుకు కరోనా సమయంలో బ్రేక్‌ పడింది. కరోనా (Corona).. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రైళ్ల సర్వీసులను నిలిపివేసింది. అలా నిలిచిపోయిన ఆఖరి రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెసే.

ఇక ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణమున్న రైలు ట్రాన్స్‌-సైబీరియన్‌ ఎక్స్‌ప్రెస్‌. పశ్చిమ రష్యాలోని మాస్కో నుంచి తూర్పు రష్యాలో ఉన్న వ్లాడ్‌వోస్టాక్‌ వరకు ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ గమ్యస్థానాల మధ్య దూరం 9,250కి.మీ. ఇది వివేక్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రయాణించే దూరానికి రెట్టింపు. ఈ ట్రాన్స్‌-సైబీరియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మాస్కో నుంచి వ్లాడ్‌వోస్టాక్‌ వెళ్లడానికి ఆరు రోజుల సమయం పడుతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని