నేపాల్‌.. ఎందుకిలా?

టిబెట్‌లోని మానస సరోవర్‌కు చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్‌ మార్గంపై నేపాల్‌ విమర్శలు చేయడంతో ఇరుదేశాల మధ్య వివాదం ఏర్పడింది. నేపాల్‌ ఏకంగా సాయుధ పోలీసు దళాన్ని....

Published : 18 May 2020 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : భారత్‌-నేపాల్ దేశాల మధ్య కొత్త రహదారి మార్గం అంతరాలు సృష్టిస్తోంది.‌  టిబెట్‌లోని మానస సరోవర్‌ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్‌ మార్గంపై నేపాల్‌ విమర్శలు చేయడంతో ఇరుదేశాల మధ్య వివాదం ఏర్పడింది. నేపాల్‌ ఏకంగా సాయుధ పోలీసు దళాన్ని కాలాపానీ సమీపంలో మోహరించడం గమనార్హం. 

ఏమిటీ లిపులేఖ్‌ మార్గం?

చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లోని కైలాస మానససరోవరం ఉంది.  భారత్‌ నుంచి వెళ్లే యాత్రికులు మూడుమార్గాలైన సిక్కిం, ఉత్తరాఖండ్‌, నేపాల్‌ నుంచి వెళుతారు. అయితే భారత్‌లోని ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పితోడ్‌గఢ్‌ నుంచి లిపులేఖ్‌ వరకు నూతన మార్గాన్ని నిర్మిస్తోంది. ఇందులో చాలావరకు పాతమార్గం ఉండగా డబుల్‌ లైన్‌ చేయడంతో పాటు చైనా సరిహద్దు వద్ద ఉన్న లిపులేఖ్‌ వరకు కొత్త మార్గాన్ని నిర్మించడం విశేషం. ఈ మార్గంతో మానస సరోవర్‌కు యాత్రికులు త్వరగా చేరుకోగలుగుతారు. దీంతో పాటు భారత రక్షణ అవసరాల దృష్ట్యా ఈ మార్గం కీలకమైనది.

అది మాదే అంటున్న నేపాల్‌

భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీతో పాటు లిపులేఖ్‌ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌ నేపాల్‌లోని దర్చులా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. మహాకాళి నది ఈప్రాంతం నుంచి ప్రవహిస్తోంది.   1816లో సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్‌ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు.  మహాకాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి.  ఈ ప్రాంతం ట్రై జంక్షన్‌ లాంటింది. నేపాల్‌, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి కీలకప్రాధాన్యత ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యత ఉందో కాలాపానీకి కూడా అంతే గుర్తింపు ఉంది. 

కాలాపానీలోనే మహాకాళి నది జన్మిస్తుంది కాబట్టి పశ్చిమ భాగం మొత్తం భారత్‌కు చెందినదని భారత్‌ వాదిస్తోంది. అయితే  తూర్పు ప్రాంతమంతా నేపాల్‌ కిందకు వస్తోందని  ఆ దేశం కొత్తవాదనకు తెరతీసింది.  1830కు సంబంధించిన పితోడ్‌గఢ్‌ రికార్డులను భారత్‌ తన మద్దతుగా బయటపెట్టింది.  1879లో బ్రిటిషు ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపానీ మొత్తం ప్రదేశం భారత్‌లోనే ఉండటం గమనార్హం. నేపాల్‌కు చెందిన ఒక అంగుళం భూమి కూడా భారత్‌ ఆక్రమించుకోదని భారత్‌ ఇది వరకే స్పష్టంచేసింది. ఈ సమస్యపై ద్వైపాక్షికచర్చలు జరగాలని రక్షణరంగ నిపుణులు  సూచిస్తున్నారు. కాలాపానీతో పాటు లిపులేఖ్‌ కనుమదారి కూడా తమ  ప్రాంతమేనని నేపాల్‌ వాదిస్తోంది. అయితే 1830 నుంచి ఈ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని భారత్‌ చెబుతోంది.  1962లో చైనా అక్రమ చొరబాట్ల కారణంగా ఈ కనుమదారిని మూసేశారు. కొన్ని సంవత్సరాల కిందటే తెరిచారు. 

చైనా పన్నాగమా?

భారత వ్యతిరేక చర్యలకు నేపాల్‌ దిగడం మన దేశానికి విస్మయం కలిగిస్తోంది. నేపాల్‌ ఆందోళనకు దిగడం వెనుక ఇతర దేశాల పాత్ర ఉండవచ్చని భారత సైనికాధిపతి జనరల్‌ నరవణె అన్నారు.  కాలాపానీకి పశ్చిమంగా ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌దే. లిపులేఖి మార్గం కూడా ఇందులోనే నిర్మిస్తున్నాం. మరి నేపాల్‌ ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని  ఆయన అన్నారు.

సామరస్యంగా సమస్య పరిష్కారం

ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్‌ యోచిస్తోంది. అయితే భారత హక్కులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్న నిశ్చయంతో ఉంది. పాత రికార్డులు, ఒప్పందాలను నేపాల్ గౌరవించాలని సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని