Hockey world cup : నవీన్‌ పట్నాయక్‌ ప్రోత్సాహం.. హాకీ జట్టులో నూతనోత్సాహం

హాకీ ప్రపంచకప్‌ పోటీలకు మూడో సారి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. చివరిసారిగా 1975లో జగజ్జేతగా నిలిచిన భారత్‌.. సొంతగడ్డపై ఈ సారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. 

Updated : 13 Jan 2023 15:39 IST

హాకీ ప్రపంచకప్‌ పోటీ(Hockey World Cup)లకు మూడో సారి భారత్‌(india) ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయి. చివరిసారిగా 1975లో జగజ్జేతగా(winner) నిలిచిన భారత్‌(india).. సొంతగడ్డపై ఈ సారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. 

నవీన్‌ పట్నాయక్‌ చొరవతో..

దేశీయ హాకీ క్రీడాకారులను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌(Naveen Patnaik) ఎంతో ప్రోత్సహిస్తున్నారు. హాకీ అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. విదేశీ కోచ్‌లు, ఫిట్‌నెస్‌ నిపుణులను రప్పించి ఆటగాళ్లకు శిక్షణ ఇప్పించారు. హాకీ ప్రపంచకప్‌ గెలిస్తే భారత జట్టులోని ఒక్కో ఆటగాడికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారంటే హాకీ పట్ల ఆయనకున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. 

(Image : Hockey India)

ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేడియం

హాకీ ప్రపంచకప్‌((Hockey World Cup) కోసం రావుర్కెలాలో ఒడిశా(Odisha) ప్రభుత్వం రూ.260 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో బిర్సాముండా స్టేడియం నిర్మించింది. అందులో 20వేలకు పైగా సీటింగ్‌ సామర్థ్యం ఉంది. క్రీడాకారుల కోసం ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో రెండు వందలకు పైగా గదులున్నాయి. ఈ నెల 5న సీఎం నవీన్‌ దీనిని ప్రారంభించారు. ప్రపంచంలోని పెద్ద స్టేడియాల్లో ఇది నాలుగోది. దాదాపు 20 మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. దీంతోపాటు భువనేశ్వర్‌(Bhuvaneswar)లో కళింగ స్టేడియం ఉంది. ఇందులో సెమీస్‌ సహా మొత్తం 24 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

తగ్గేదేలే అంటోన్న జట్టు

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. 2019లో ప్రధాన కోచ్‌గా నియమితులైన గ్రాహమ్‌ రీడ్‌ చక్కటి సూచనలు ఇస్తూ క్రీడాకారులను ముందుకు నడిపిస్తున్నారు. దాంతో 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సొంతమైంది. కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయం, ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రో లీగ్‌ (2021-22)లో మూడో స్థానం ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది.

(Image : Hockey India)

జట్టు సభ్యులు వీరే : హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), అమిత్‌ రోహిదాస్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌, సురేందర్‌ కుమార్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మణ్‌దీప్‌ సింగ్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌, క్రిషన్‌ పాథక్‌, సంజీప్‌, శ్రీజేష్‌, నీలకంఠ శర్మ, షంషేర్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, వివేక్‌ సాగర్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌.

తొలి ఢీ స్పెయిన్‌తోనే..

భారత్‌ తొలి మ్యాచ్‌ ఇవాళ సాయంత్రం స్పెయిన్‌తో జరగనుంది. తొలిసారి కప్పును ముద్దాడాలనే లక్ష్యంతో ఆ దేశం కూడా తహతహలాడుతూ ఉంది. 1971, 1998లో రన్నరప్‌గా నిలిచిన స్పెయిన్‌ జట్టు.. 2006లో కాంస్యం సొంతం చేసుకుంది.

ప్రపంచ కప్‌లో మనం..

మొట్టమొదటి పురుషుల ప్రపంచకప్‌ (1971)లో కాంస్యం, రెండో ప్రపంచకప్‌ (1973)లో రజతం, మూడో ప్రపంచకప్‌ (1975)లో పసిడి భారత్‌ గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని