Kedarnath : గడ్డకట్టే మంచులో కేదార్‌నాథ్‌ ఆలయం.. ఆరునెలల తరువాత దర్శనం!

హిమాలయాల్లోని కేదార్‌నాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 25వ తేదీన తెరచుకోనుంది. శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలలు మూసి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు తెరుస్తున్నారు. ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకతేంటో చదివేయండి మరి..

Published : 19 Feb 2023 14:41 IST

ఉత్తరాఖండ్‌లో (uttarakhand) యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌(badrinath) ఆలయాల సందర్శనను చార్‌ధామ్‌ యాత్రగా పిలుస్తారు. చార్‌ధామ్‌ యాత్ర ఈ హిమాలయ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఏటా యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది 15 లక్షలకు పైగా భక్తులు కేదార్‌నాథ్‌ను (Kedarnath Temple) సందర్శించారు. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని కేదార్‌నాథ్‌ ఆలయానికి దాదాపు 1200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో (Jyotirlingas) ఇది అత్యంత ఎత్తులో ఉన్న క్షేత్రం. 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయానికి సమీపంలో మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడికి నేరుగా రోడ్డుమార్గం ఉండదు. కాలినడకన లేదా డోలీలు, గాడిదలు, గుర్రాలపై ప్రయాణిస్తూ కొండమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 

ఆలయం ఎప్పుడు తెరుస్తారు?

కేదార్‌నాథ్‌ ఆలయం తెరిచేందుకు అక్షయ తృతీయ పండగను పరిగణలోకి తీసుకుంటారు. ఏటా మహాశివరాత్రి (Mahashivratri) రోజున ఆలయం తెరిచే తేదీని వెల్లడిస్తారు. పంచాంగం ప్రకారం ఉఖీమఠ్‌లోని పూజారులు ఆలయాన్ని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు. అలా ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ఆలయ తలుపు తెరవాలని తీర్మానించారు. బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రిలను ఏప్రిల్‌ 22, 27 తేదీల్లో తెరవనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కేదార్‌నాథ్‌లో తొలిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రధాన పూజరులు తొలుత స్వామిని దర్శించుకుంటారు. లింగేశ్వరుడి ఆశీస్సులు పొందుతారు. కేదార్‌నాథ్‌ ఆలయం తలుపులు తెరిచే తొలిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు తొలి రోజు దర్శనానికి పోటెత్తుతారు.

మళ్లీ ఎప్పుడు మూసివేస్తారంటే..

ఇక కేదార్‌నాథ్‌ ఆలయం (Temple) దీపావళి తరువాత రెండు రోజులకు మూసేస్తారు. రాఖీ పౌర్ణమి తరహాలో భాయ్‌దూజ్‌ పండగ తరువాత ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఏడాది నవంబర్‌ 12న దీపావళి. కాబట్టి నవంబర్‌ 14న ఈ ఆలయం మూసివేత ఉంటుందని చెబుతున్నారు. చలికాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో ఉదయం నాలుగు గంటలకే ప్రత్యేక పూజ, అర్చన చేస్తారు. ఆలయ పూజారులు మంత్రాలను పఠిస్తూ 8.30 గంటలకు తలుపులు మూసివేస్తారు. ఈ ఆలయం మూసివేత తేదీని విజయదశమి రోజున నిర్ణయిస్తారు. కేదార్‌నాథ్‌ ఆలయం తెరిచే కార్యక్రమంలాగే.. మూసే కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహిస్తారు. గఢ్వాల్‌ బ్యాండ్‌ వాయిస్తూ బాబా కేదార్‌ డోలీని ఉఖీమఠ్‌కు తరలిస్తారు. కేదారేశ్వరుడికి అక్కడి ఓంకారేశ్వర ఆలయంలో నివాసం ఏర్పాటు చేసి మిగతా ఆరునెలలు పూజలు చేస్తారు. 

గడ్డకట్టే మంచు కారణంగానే..

నవంబరులో చలికాలం మొదలు కాగానే హిమాలయాల్లో మంచు కురవడం ప్రారంభమవుతుంది. దాంతో కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాలను మొత్తం మంచు కప్పేస్తుంది. ఆలయానికి చేరుకునే మార్గాలు సైతం మూసుకుపోతాయి. దీంతో ఆలయాన్ని ఆరునెలలపాటు మూసివేస్తారు. అందుకే శివుడి విగ్రహాన్ని కేదార్‌ఖండ్‌ నుంచి ఉఖీమఠ్‌కు తరలిస్తారు. యమునోత్రి నుంచి యమునాదేవిని జాంకిఛట్టి సమీపంలోని ఖార్సాలికి తరలిస్తారు. గంగోత్రి నుంచి గంగా మాతను ముఖ్బాకు పల్లకిలో తీసుకెళ్తారు. మంచు ప్రభావం పూర్తిగా తగ్గి వేసవి ప్రారంభమయ్యే సమయంలో తిరిగి ఆ విగ్రహాలను ధామ్‌లకు తీసుకొస్తారు. మే నెలలో కేదార్‌నాథ్‌ దర్శనానికి అత్యధిక మంది భక్తులు తరలివెళ్తారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది. 

కేదార్‌నాథ్‌ చేరుకునే మార్గాలు..

బస్సు : ఎక్కువ శాతం మంది భక్తులు బస్సులోనే ఈ యాత్రకు వెళ్తుంటారు. రిషికేశ్‌, హరిద్వార్‌, శ్రీనగర్‌ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే బస్సు సర్వీసులతో కేదార్‌నాథ్‌ చేరుకోవచ్చు. 
విమానం : దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు దేహ్రాదూన్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేదార్‌నాథ్‌కు వెళ్లొచ్చు. 
హెలికాప్టర్‌ : ఖర్చులకు వెనుకాడని యాత్రికుల కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ సర్వీసులు నడుస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థల హెలికాప్టర్లు కూడా కేదార్‌నాథ్‌కు తీసుకెళ్తాయి. 
రైలు : రైలు ప్రయాణం ద్వారా వచ్చే యాత్రికులు రిషికేశ్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి అక్కడి నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరాల్సి ఉంటుంది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని