Kolkata metro : భారత్‌లో తొలిసారి నదీగర్భంలో మెట్రో.. ఎలా నిర్మించారంటే!

కోల్‌కతా (kolkata) మెట్రో (metro) ప్రయాణికులు త్వరలో సరికొత్త అనుభూతిని పొందబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరికల్లా  హుగ్లీ నది కింద నిర్మించిన మెట్రో మార్గంలో ప్రయాణించబోతున్నారు.

Published : 23 Apr 2023 16:49 IST

(Image : ashwini vaishnaw twitter)

భారత్‌లోని ప్రముఖ నగరాల్లో మెట్రో రైళ్లు (metro) అద్భుతంగా సేవలందిస్తున్నాయి. వేగం, భద్రత, సమయపాలన, సౌకర్యాలతో మిళితమైన ఆ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ ఉంది. దేశంలోనే తొలి మెట్రోగా పేరుగాంచిన కోల్‌కతా మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (kolkata metro rail corporation) ఇటీవల అరుదైన ఘనత సాధించింది. ప్రఖ్యాత హుగ్లీ నది లోపల నిర్మించిన ట్రాక్‌పై మెట్రో రైలును (metro rail) ట్రయల్‌ రన్‌ ద్వారా పరుగులు పెట్టించింది. ఈ నేపథ్యంలో ఆ అండర్‌ వాటర్‌ మెట్రో గురించి పూర్తి విశేషాలు తెలుసుకోండి.

ఏంటీ ప్రాజెక్టు? 

కోల్‌కతాలోని తూర్పు, పశ్చిమ కారిడార్లను అనుసంధానం చేసే ఉద్దేశంతో 16.6 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి. ఈ కారిడార్ల పరిధిలో ఎస్‌ప్లనాడె, మహాకారణ్‌, హావ్‌ డా, హావ్‌ డా మైదాన్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లున్నాయి. సాల్ట్‌ లేక్‌ సెక్టార్‌ వి ఐటీ హబ్‌, హావ్‌ డా మైదాన్‌ స్టేషన్ల మధ్య.. హుగ్లీ నదీ గర్భంలో ప్రతిష్ఠాత్మక టన్నెల్‌ నిర్మించారు. 520 మీటర్ల పొడవైన ఆ టన్నెల్‌ మార్గాన్ని కేవలం 45 సెకన్లలోనే మెట్రో రైల్‌ దాటేస్తుంది. అది నదీ గర్భానికి 33 మీటర్ల లోతులో ఉంది. అందులోకి నీరు చొచ్చుకురాకుండా 1.4 మీటర్ల వెడల్పైన కాంక్రీటు రింగులను అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్‌ గాస్కెట్లను తగిలించారు. ఈ తరహా టెక్నాలజీని యూరోస్టార్‌ అనే కంపెనీ లండన్‌, ప్యారిస్‌ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. హుగ్లీ నదీ గర్భ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మనకూ ఆ ఘనత దక్కుతుంది. 

బాహుబలి యంత్రం

టన్నెల్‌ అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా.. బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. దీని తవ్వకంలో భారీ యంత్రాలను వినియోగించారు. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ సహాయంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేశారు. ఆ బోరింగ్‌ మిషన్‌ను జర్మనీలో రూపొందించారు. దానికి ప్రేరణ&రచన అని నామకరణం చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ మిషన్‌ టన్నెల్‌ను తవ్వేసింది. ఈ మార్గం చుట్టుపక్కల అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండానే పనులు పూర్తి చేశారు.

ప్రయాణ సమయం ఆదా

టన్నెల్‌ మార్గం ఏర్పాటు చేయడం వల్ల కోల్‌కతా-హావ్‌ డా మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. సెక్టార్‌ వి, హావ్‌ డా మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. హావ్‌ డా నుంచి సెల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 1.5 గంటల సమయం పడుతుంది. అదే మెట్రో అందుబాటులోకి వస్తే 40 నిమిషాల్లోనే వెళ్లిపోవచ్చు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది.

మధ్యలోనే ఆగిపోతే?

అనేక సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలు కొన్ని సార్లు ఆగిపోతుంటాయి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందకుండా పక్కనే ఉన్న నడక మార్గాన్ని వినియోగించుకోవచ్చని ఈ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వారు వివరించారు.  

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని