cool sunglasses : చిప్స్‌ ప్యాకెట్స్‌ వ్యర్థాలతో కూలింగ్‌ గ్లాసెస్‌.. ఆలోచన అదిరింది!

మార్కెట్లో దొరికే లేస్‌, కుర్‌ కురే వంటి చిరుతిళ్ల ప్యాకెట్లను (Chips packets) ఖాళీ చేసి మనం చెత్తలో పడేస్తుంటాం. అలాంటి వాటిని సేకరించి ‘ఆశయ’ అనే స్టార్టప్‌ కంపెనీ స్టైలిష్‌ సన్‌గ్లాసెస్‌ (Sunglasses) తయారు చేస్తోంది.

Published : 19 Apr 2023 15:57 IST

(Image : Anish Malpani twitter)

ఆధునిక ప్రపంచాన్ని ప్లాస్టిక్‌ భూతం పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం రోడ్లపై ఎక్కడ చూసినా ఆ వ్యర్థాలే (Plastic waste) కన్పిస్తున్నాయి. వాటిని ఏరుకొని విక్రయించగా వచ్చిన ఆదాయంతో అనేక మంది బడుగు జీవులు పొట్ట నింపుకొంటున్నారు. ఆ వ్యర్థాలు కొన్ని ఫ్యాక్టరీలకు చేరి తిరిగి ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు, కవర్లుగా మారి మళ్లీ జనావాసంలోకి వస్తున్నాయి. కొన్ని మాత్రం భూమిలో కలిసిపోకుండా ఏళ్ల తరబడి అలానే ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్‌ సమస్యను నిర్మూలించేందుకు తన వంతుగా ఏం చేయొచ్చని ఆలోచించాడు అనిశ్‌ మల్పానీ (Anish Malpani) అనే యువకుడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసేందుకు ‘ఆశయ’ అనే స్టార్టప్‌ కంపెనీని (Startup company) నెలకొల్పాడు.

రెండేళ్లు కొనసాగిన పరిశోధన

ప్లాస్టిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తే బాగుంటుందనే విషయంపై అనిశ్‌ సుమారు రెండేళ్లు పరిశోధన చేశారు. అందు కోసం ల్యాబ్‌లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి. చివరికి చలువ కళ్లద్దాలు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంతో చిప్స్‌ ప్యాకెట్లు మాత్రమే కాకుండా చాక్లెట్‌ పేపర్లు, టెట్రా ప్యాక్‌లు వినియోగించి స్టైలిష్‌ సన్‌ గ్లాసెస్‌ తయారు చేశారు. ‘ప్రపంచంలోనే తొలిసారి తాము చిప్స్ ప్యాకెట్ల వ్యర్థాల నుంచి చలువ కళ్లద్దాలు తయారు చేశామని’ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి అనిశ్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తొలుత ఈ ప్రకటనను చాలా మంది కొట్టి పడేశారు. కానీ, కళ్లద్దాలు తయారు చేసిన విధానం గురించి పూర్తి వీడియో చూశాక అంతా నమ్మక తప్పలేదు. తమ ఈ వ్యాపార ప్రయత్నం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అనిశ్‌ విశ్వసిస్తున్నారు.

తొలుత 500 ఆర్డర్లు

అనిశ్‌ తాను తయారు చేసిన సరికొత్త కళ్లద్దాల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగానే సుమారు 500 ఆర్డర్లు వచ్చాయట. నిజానికి వీటిని ఎవరైనా కొంటారా?అనే సందేహం అనిశ్‌కు ఉండేదట. కానీ.. క్రమంగా ఆర్డర్లు ఊపందుకోవడంతో తన కష్టం వృథా కాలేదనుకున్నాడు. అనిశ్ చలువ కళ్లద్దాల తయారీతో కేవలం చెత్త సమస్యకు మాత్రమే పరిష్కారం చూపలేదు. చెత్త ఏరుకుంటూ జీవించే వారి బతుకుల్లో మార్పు తేవడం కోసం ఆ పని చేసే ఆరుగురిని తన ల్యాబ్‌లో ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. అంతే కాదు కంపెనీలో వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని చెత్త ఏరుకుని జీవించే వారి పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు.

పేరు సరికొత్తగా..!

అనిశ్‌ తన చలువ కళ్లద్దాలకు ‘విత్‌ అవుట్‌’ అని పేరు పెట్టాడు. కొత్త వస్తువు ఏదైనా మార్కెట్లోకి విడుదల చేస్తే దాని పేరు సరి కొత్తగా ఉంటేనే జనాలను ఆకర్షిస్తుంది. అందుకే ఓ స్నేహితుని సూచన మేరకు ఆ పేరు పెట్టాడు. ఇక ఈ విత్‌ అవుట్ సన్‌ గ్లాసెస్‌ మన్నిక కూడా ఎక్కువేనట. వాటిని కారుతో తొక్కించినా పగిలిపోవని చెబుతున్నారు. సూర్యకాంతి నుంచి రక్షణ కోసం ఈ అద్దాల్లో యూవీ పోలరైజ్డ్‌ సాంకేతికత వినియోగించారు. ఈ కళ్లద్దాల ఫ్రేమ్‌పై ఉన్న క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన వ్యర్థాలను ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు, తయారీలో ఎవరు పాల్గొన్నారు వంటి సమాచారం దొరుకుతుంది.  ప్రస్తుతానికి అనిశ్‌ కంపెనీ ల్యాబ్‌లో మైక్రో పైలట్‌ ప్లాంట్‌ నడుస్తోంది. అది రోజుకు 5 కేజీల మల్టీ లేయర్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేస్తుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు