True Friendship : యువకుడితో కొంగ స్నేహం.. ఎక్కడికెళ్లినా వెంటపడుతోందట!

ఆపదలో తనను కాపాడిన యువకుడితో ఓ కొంగ స్నేహం చేస్తోంది. ఎక్కడికెళ్లినా నీ వెంటే నేనుంటానని ఎగురుతోంది.

Updated : 01 Mar 2023 10:51 IST

(Image : twitter)

లఖ్‌నవూ: ఆపద సమయంలో ఆదుకున్న వారిని మర్చిపోకూడదని అంటారు. ఆ మాటను సరిగ్గా ఒంట పట్టించుకున్నట్లుంది ఓ కొంగ. తనను కాపాడిన ఓ యువకుడితో ఏడాది కాలంగా స్నేహం(Friendship) చేస్తోంది. అతడి ఇంట్లో ఉంటోంది. తింటోంది. ఎక్కడికెళ్లినా కూడా వస్తోంది. బైక్‌ వెనకాలే ఎగురుతూ షికారు కూడా చేస్తోంది. ఇంతకీ ఈ వింత ఎక్కడ అంటారా..? ఉత్తరప్రదేశ్‌(uttar pradesh) రాష్ట్రం అమేఠి జిల్లాలోని మండ్కా గ్రామంలో ఈ సరికొత్త స్నేహబంధం వెలుగు చూసింది.

ఎలా సాధ్యమైంది?

మండ్కా గ్రామానికి చెందిన మహమ్మద్‌ ఆరిఫ్‌ వ్యవసాయం చేస్తుంటాడు. గతేడాది ఆగస్టులో తాను పొలానికి వెళ్లగా ఓ కొంగ(stork) కుడికాలికి గాయమై దూరంగా పడి ఉంది. దెబ్బ బాగా తగలడంతో గట్టిగా అరుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆరిఫ్‌ దాని దగ్గరకు వెళ్లాడు. నాలుగడుగులకు పైగా ఉన్న దాని శరీరాకృతి చూసి తొలుత ముట్టుకునేందుకు జంకాడు. చివరికి ధైర్యం చేసి ఆ కొంగను పట్టుకున్నాడు. గాయాన్ని పరిశీలించి.. చుట్టూ ఉన్నవారి సాయంతో ఇంటికి తీసుకెళ్లాడు. తనకు తోచిన వైద్యం(treatment) చేసి మందు రాశాడు. నెల రోజులపాటు దాన్ని తన ఇంట్లోనే ఉంచి చికిత్స చేశాడు. దీంతో ఎట్టకేలకు కొంగ కోలుకుంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఆరిఫ్‌ కుటుంబ సభ్యులు దానికి బాగా దగ్గరయ్యారు. అతడి భార్య ఆహారం పెట్టడం, పిల్లలు ఆడుకోవడం చేసేవారు. అది పూర్తిగా కోలుకోవడంతో విడిచి పెట్టడానికి ఊరి బయటకు తీసుకెళ్లారు. కాసేపటికి ఎగిరిపోయిన కొంగ మళ్లీ తిరిగి ఆరిఫ్‌ దగ్గరకే వచ్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి దానికి ఆహారం పెడుతూ ఓ కుటుంబ సభ్యురాలిలా చూస్తున్నారు. కొంగ కూడా వారితో స్నేహాన్ని కొనసాగిస్తూ ఎక్కడికీ వెళ్లడం లేదు. 

ఇంత ప్రేమ ఊహించలేదు : ఆరిఫ్‌

దీనిపై ఆరిఫ్‌ మాట్లాడుతూ తనను కొంగ ఇంతలా ప్రేమిస్తుందని ఊహించలేదన్నారు. ఇంట్లో మనిషిలా మెలుగుతూ అది తన ప్లేట్‌లోనే భుజిస్తోందని ఆనందంగా చెప్పారు. దాన్ని తాను బంధించలేదు కనుక అటవీ, వన్యప్రాణుల సంరక్షణ అధికారుల నుంచి ఎలాంటి అడ్డంకులు రాలేదని తెలిపారు. రోజూ బైక్‌పై వెళ్లే సమయంలో తనతో మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఎగురుతూ వెనకే వస్తోందని వివరించాడు. ఎదురుగా వాహనాలు వస్తే అప్పటికప్పుడు పైకి ఎగిరిపోయి.. తరువాత కిందకు దిగుతోందని కొంగ తనతో ప్రయాణిస్తున్న తీరును వెల్లడించారు. కొంగ భద్రత దృష్ట్యా ట్రాఫిక్‌ ఉండే రోడ్లపైకి వెళ్లడం లేదన్నారు. తమ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆరిఫ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు