Eye Health: పిల్లల కంటిచూపు మందగిస్తోందా? ఈ జాగ్రత్తలు పాటించండి

tips For preventing eye sight: చిన్నారుల్లో కంటి సమస్యలు ( Eye sight) తలెత్తిత్తే తొలినాళ్లలోనే గుర్తించినట్లయింతే పరిష్కారం మరింత సులభమవుతుంది. చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ ఫలితముంటుంది. అవేంటో తెలుసా? 

Updated : 05 May 2023 16:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పుట్టిన వెంటనే పిల్లల కంటిచూపు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొందరిలో కళ్లు పూర్తిగా అభివృద్ధి చెందవు. వాళ్లు పెరిగే కొద్దీ కంటిలోపలి నిర్మాణాలు పూర్తి స్థాయిలో తయారవుతాయి. చాలా మంది పిల్లలకు పుట్టినప్పుడు కంటి లోపాలు ఉంటాయి. క్రమంగా చాలా వరకు సర్దుకుంటాయి. కొన్నిసార్లు మాత్రం దీర్ఘదృష్టి,  హ్రస్వదృష్టి లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా చిన్నారులు ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్‌ స్క్రీన్ చూస్తే  వారి కళ్లు ఒత్తిడి, అలసటకు గురవుతాయి. వాటివల్ల కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇంతకీ చిన్నారుల కళ్లు బలహీనపడకుండా, వారి చూపు మందగించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లల కళ్లపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకుంటే ఇవి వారి నేర్చుకునేతత్వంపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కంటిచూపు సరిగా లేని పిల్లలు చదువులోనూ వెనుకబడే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి.. భవిష్యత్‌లో చాలా నష్టం వాటిల్లవచ్చు. దృష్టి ప్రభావం పిల్లల శారీరక ఎదుగుదలపైనా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు కంటిచూపు తక్కువున్న వారిలో చేయి-కన్నుకు మధ్య సమన్వయం లోపిస్తుంది. అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్రీడలు, వ్యాయామం తదితర ఫిజికల్‌ యాక్టివిటీస్‌పై వారు మొగ్గు చూపరు. ఫలితంగా దాని ప్రభావం శరీరక ఎదుగుదలపై పడుతుంది. పిల్లల కంటి చూపు మెరుగుపడేలా జాగ్రత్తలు తీసుకుంటే.. వారిని శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంచొచ్చని నిపుణులు చెబుతున్నారు.

1. ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించండి

ఈ తరం పిల్లలు ఎక్కువ మంది చాలా వరకు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వీలుదొరికితే చాలు మొబైల్‌ను చేతిలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా శారీరక వ్యాయామం ఉండటం లేదు. వీలైనంత వరకు పిల్లల్ని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. సహజ వెలుతురులో సమయం గడపడం వల్ల హ్రస్వదృష్టి (మయోపియా) వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో దగ్గరి వస్తువులు బాగానే కనిపిస్తాయి.కానీ, దూరంగా ఉన్న వస్తువులు మాత్రం సరిగా కనిపించవు. 

2. స్క్రీన్‌ టైం తగ్గించండి

ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ స్క్రీన్‌ చూస్తే.. కళ్లు బాగా ఒత్తిడికి గురవుతాయి. కొన్ని సార్లు పొడి బారిపోయి కంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పిల్లలకు వీలైనంత వరకు మొబైల్స్‌, టీవీలను చూపించకపోవడమే ఉత్తమం. ఒకవేళ చూపించాల్సి వస్తే.. మధ్య మధ్యలో విరామం ఇవ్వడం తప్పనిసరి.

3. తగినంత వెలుతురు ఉండేలా..

చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు ఆ ప్రదేశంలో సరైన వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి. లేదంటే వారి కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

4. ఆరోగ్యకరమైన ఆహారం

చిన్నతనంలోనే శరీర ఎదుగుదల బాగుంటుంది. అందువల్ల వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా జాగ్రత్తపడాలి. విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు ఇవ్వాలి. దీనివల్ల వారి కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కుగా తినేలా ప్రోత్సహించండి.

5. కంటిపరీక్షలు తప్పని సరి

పిల్లలకు తరచూ కంటి పరీక్షలు చేయించడం ఉత్తమం. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలోనే సమస్యను నిర్ధారించడం వల్ల చికిత్స కూడా సులువవుతుంది.

6.  పరిశుభ్రతను ప్రోత్సహించండి

చిన్నప్పటి నుంచే పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా కళ్లను తాకేముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు.

7. కళ్లకు దెబ్బలు తగలకుండా..

చిన్నతనంలో దెబ్బలు తగలటం సర్వసాధారణం. ప్రత్యేకంగా పిల్లలు ఆరుబయట ఆడుకునేటప్పుడు కళ్లలో ఇసుక పడిపోవడం లేదా చిన్నపాటి గాయాలవుతుంటాయి. వీటి నుంచి జాగ్రత్తపడేందుకు పిల్లలకు కళ్లజోడు, చిన్నపాటి హెల్మెట్‌ లాంటివి ఇస్తే బాగుంటుంది.

8. ఎలా చదవాలో చెప్పండి..

చాలా మంది పిల్లలు చదువుతున్నప్పుడు పుస్తకాలను కళ్లకు దగ్గరగా పెట్టుకుంటారు. పడుకొని కొందరు.. తక్కువ వెలుతురులో ఇంకొందరు ఇలా రకరకాలుగా చదువుతుంటారు. వాటన్నింటికీ బ్రేక్‌ చెప్పి.. ఎలా చదవాలో పిల్లలకు నేర్పించాలి. నిటారుగా కూర్చొని.. కంటికి, పుస్తకానికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి. వివిధ భంగిమల్లో చదవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి అవి తొందరగా అలసిపోతాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పిల్లల కంటి ఆరోగ్యమే కాకుండా.. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. మీ పిల్లలకు ఏమైనా సమస్యలు సమస్యలు ఉంటే.. సంబంధిత వైద్యుడిని సంప్రదించి.. వారి సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని