Tulip Flowers: కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది.. ‘తులిప్‌’ విశేషాలు తెలుసా?

జమ్మూకశ్మీర్‌లో తులిప్‌ గార్డెన్‌ తెరుచుకుంది. ఏప్రిల్‌ 3 నుంచి 20వరకు తులిప్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ అరుదైన పుష్పాలగురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

Updated : 06 Mar 2023 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్‌ పుష్పాల(Tulip flowers) గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకొనేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. భూలోకంలో స్వర్గసీమను తలపించేలా ఉండే ఈ పుష్పాలు ఏటా వసంత రుతువు(spring season)లో విరబూస్తూ పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఈ ఏడాది శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. ఏప్రిల్‌ 3 నుంచి 20 రోజుల పాటు తులిప్‌ ఫెస్టివ్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తులిప్‌ పుష్పాలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విశేషాలివే..!

  • తులిప్‌ అంటే లాటిన్‌ భాషలో తలపాగా అని  అర్థం.  ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి.
  • ఈ పూల మొగ్గల్లోని ఎక్కువ రకాలు ఒకే విధమైన ఆకృతితో ఉంటాయి.  తులిప్‌ పూలలో చాలా వరకు మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కొన్ని రకాల్లో మాత్రం ఒకే కాండానికి నాలుగు పూలు పూస్తాయి.

  • వసంత కాలంలో మూడు నుంచి ఏడు రోజుల పాటు వికసించే ఈ తులిప్‌ పుష్పాలు..  దాదాపు అన్ని రంగుల్లో కనులవిందు చేస్తాయి.

  • తులిప్‌లలో ప్రతి రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది.  ఉదాహరణకు ఎర్రని రంగుతో ఆకట్టుకొనే పూలను నిజమైన ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అలాగే, ఊదా రంగులో ఉన్న పుష్పాలను విధేయతకు సంకేతంగా పరిగణిస్తుంటారు. 

  • ఏదైనా తప్పు చేసినప్పుడు అవతలి వారి క్షమాపణ కోరేందుకు తెలుపు రంగు తులిప్‌ పుష్పాలను గుర్తుగా భావిస్తారు..

  • తులిప్‌ పూలు వికసిస్తే అది వసంత కాలం ఆరంభానికి గుర్తుగా భావిస్తారు. వాస్తవానికి తులిప్‌ పుష్పాలు మధ్య ఆసియాకు చెందినవి. కానీ, ఇవి నెదర్లాండ్స్‌కు చేరిన తర్వాతే మంచి ఆదరణ పొందాయి. 

  • పార్కిన్‌సన్‌ వ్యాధి ఫౌండనేషన్‌ తమ సంస్థ చిహ్నంగా తులిప్‌ పుష్పాలనే ఎంచుకొంది. తులిప్‌ పుష్పాలు అత్యంత ఖరీదైనవి. 1600 సంవత్సరంలో నెదర్లాండ్స్‌లో ఒక ఉద్యోగి సగటు జీతం కంటే తులిప్‌ పుష్పాల ఖరీదు 10 రెట్లు ఎక్కువగా ఉండేదట. 1634 నుంచి 1637 మధ్య కాలాన్ని తులిప్‌ మానియాగా పేర్కొంటారు.  ఆ సమయంలో తులిప్‌ పుష్పాలు అత్యంత ఎక్కువ ధర పలికాయట.

  • తులిప్‌ రెమ్మలను తినొచ్చు. ఇప్పటికీ కొన్ని వంటకాల్లో ఉల్లిపాయలకు బదులు తులిప్‌ రెబ్బలనే వాడుతుంటారు. ప్రపంచంలోనే తులిప్‌ పుష్పాలను పెద్ద ఎత్తున సాగు చేసి మార్కెట్‌ చేస్తున్న దేశం నెదర్లాండ్స్‌. ఏడాదిలో దాదాపు మూడు బిలియన్లకు పైగా తులిప్‌ పుష్పాలను సాగు చేస్తుంటుంది.

  • తులిప్‌ పూలను ఒక్కసారి కత్తిరిస్తే అవి మరో అంగుళం వరకు పెరుగుతూనే ఉంటాయి. ఆకురాలే కాలాన్ని తులిప్‌ పూలను నాటేందుకు అనువైన సమయంగా భావిస్తారట. ఆ సమయంలో నాటితే వసంత కాలం వచ్చేసరికి  మూలాలను బలంగా తయారు చేసుకుంటాయి.

  • తులిప్‌ పుష్పాలు పెరిగేందుకు వీలుగా కాంతి వైపు వంగి మెలి తిరుగుతాయి. ఫ్లవర్‌వాజ్‌లో పెట్టినా అవి కాంతి ఉండే వైపే తిరుగుతాయట.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని