Sunset: సూర్యుడు అస్తమించని ప్రాంతాలివీ..!

సూర్యుడు తూర్పు వైపు ఉదయించి పడమర అస్తమిస్తాడని చిన్నతనంలోనే చదువుకున్నాం. సూర్యోదయం, సూర్యాస్తమయం ఉన్నాయి కాబట్టే.. రాత్రి, పగలు అనే వేళలున్నాయని తెలుసుకున్నాం. అయితే, ప్రపంచంలో కొన్ని చోట్లలో ఈ నియమం వర్తించదు. అక్కడ కొన్ని కాలాల్లో సూర్యుడికి అస్తమయమే

Published : 16 Nov 2021 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సూర్యుడు తూర్పు వైపు ఉదయించి పడమర అస్తమిస్తాడని అందరికీ తెలిసిందే. సూర్యోదయం, సూర్యాస్తమయం ఉన్నాయి కాబట్టే.. రాత్రి, పగలు అనే వేళలున్నాయని తెలుసుకున్నాం. అయితే, ప్రపంచంలో కొన్ని చోట్లలో ఈ నియమం వర్తించదు. అక్కడ కొన్ని కాలాల్లో సూర్యుడికి అస్తమయమే ఉండదు. రోజంతా పగటి పూటలాగే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా..! మరి అలాంటి ప్రాంతాలేవి..? ఎక్కడ ఉన్నాయో చూద్దామా..

హమ్మర్‌ఫెస్ట్‌, నార్వే

ఆర్కిటిక్‌ పరిధిలో ఉన్న నార్వేలో హమ్మర్‌ఫెస్ట్‌ అనే నగరముంది. ఇక్కడ నిత్యం సూర్యుడు ప్రకాశవంతమైన కాంతుల్ని వెదజల్లుతూ.. ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంటాడు. అయితే, కేవలం 40 నిమిషాలు మాత్రమే భానుడికి విశ్రాంతి లభిస్తుంటుంది. రాత్రి 12.43 గంటలకు సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లి.. 40 నిమిషాలకు తిరిగి ప్రకాశిస్తుంటాడు. అందుకే, ఇంతటి వైవిధ్యమైన ప్రకృతి సోయగమున్న ఈ ప్రాంతాన్ని యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. నార్వేలోనే మరో ప్రాంతమైన స్వాల్‌బార్డ్‌ ప్రాంతంలో ఏటా ఏప్రిల్‌ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు 24/7 ప్రకాశిస్తూనే ఉంటాడు.


ఐస్‌లాండ్‌

 ఐస్‌లాండ్‌లో ఆవాస ప్రాంతాలు తక్కువే. అయినా.. పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఐస్‌లాండ్‌లో జూన్‌ మాసంలో సూర్యుడు అస్తమించడు. రాత్రుళ్లు కూడా పగలులాగే ఉంటుంది. ఈ ఐలాండ్‌లో దోమలు ఉండకపోవడం మరో విశేషం. దీంతో ఈ ప్రకృతి వింతలను చూడటానికి అనేక మంది పర్యటకులు ఈ ఐలాండ్‌కు వస్తుంటారు.


యుకొన్‌, కెనడా

ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటైన కెనడాలోని యుకొన్‌ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే, వేసవి కాలంలో మాత్రం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. దాదాపు 50 రోజులపాటు నిర్విరామంగా ప్రకాశిస్తాడు. అందుకే, ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉండే ప్రాంతం అని పిలుస్తుంటారు. ఆ సమయంలో వికసించే పూలు, వలస పక్షుల కిలకిలరావాలతో యుకొవ్‌ నగరంలో అద్భుతమైన వాతావరణం నెలకొంటుంది.


కానాక్‌, గ్రీన్‌లాండ్‌

గ్రీన్‌లాండ్‌లో ఉత్తరంవైపు ఉండే ఈ నగరంలో నివసించే జనాభా కేవలం 650 మాత్రమే. శీతాకాలంలో ఈ ప్రాంతమంతా చీకట్లోనే ఉండిపోతుంది. వేసవికాలంలో అంటే ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెల మధ్య సూర్యుడి హవా నడుస్తుంది. చీకట్లో జీవించడం అలవాటైన అక్కడి ప్రజలకు సూర్యుడి కాంతి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంటుందట. ముఖ్యంగా భానుడి వెలుతురుకు నిద్రపట్టదట. అందుకే ఇంట్లో గుమ్మానికి, కిటికీలకు నల్లని పరదాలు వేస్తుంటారు. అయితే, సాయంత్రం వేళలో మాత్రం అక్కడి ప్రకృతి మనోహరంగా కనిపిస్తుంది.


కిరునా, స్వీడెన్‌

స్వీడెన్‌లోని కిరునా నగరం చూడటానికి సాధారణంగా కనిపించినా.. ఏడాదిలో వంద రోజులు పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే.. ఏటా మే - ఆగస్టు మధ్య దాదాపు వంద రోజులపాటు సూర్యుడు అస్తమించకుండా కాంతులీనుతుంటాడు. ఈ రోజుల్లో కిరునా అందాలు చూడటానికి పర్యటకులు క్యూ కడుతారు. ఇక్కడి చర్చ్‌ నిర్మాణం ప్రపంచాన్నే అబ్బురపర్చే విధంగా ఉంటుంది. పనిలోపనిగా ఈ చర్చ్‌ను చూడటానికి కూడా సందర్శకులు వస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని