Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!

అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్‌ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 25 Nov 2023 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: జేవియర్‌ మిలి (Javier Milei) అంటే అర్జెంటీనాలో చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ‘ఎల్‌ లోకో’ అంటే స్పానిష్ భాషలో పిచ్చివాడని అర్థం. ఈ పేరును వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతే కాదు.. త్వరలో తమ దేశ పగ్గాలను చేపట్టనున్న అధ్యక్షుడని సగర్వంగా చెబుతారు. ఇటీవల అర్జెంటీనా (Argentina)లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఆయన.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎందుకంత సంచలనం?

ఇటీవల జరిగిన అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో ‘లిబర్టీ అడ్వాన్సెస్‌ కూటమి’కి చెందిన జేవియర్‌.. తన ప్రత్యర్థి, ‘యూనియన్‌ ఫర్‌ ది హోమ్‌లాండ్‌’కు చెందిన అభ్యర్థి సెర్గియో మాసపై విజయం సాధించారు. సుదీర్ఘకాలంగా అర్జెంటీనా ధరల పెరుగుదల, నిరుద్యోగం.. తదితర సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ఇచ్చిన హామీలకు దేశ ప్రజలు ఆకర్షితమయ్యారు. దేశయ కరెన్సీ పెసోను ఏకంగా రద్దు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఆ స్థానంలో అమెరికన్‌ డాలర్‌ను కరెన్సీగా తీసుకురానున్నారు.  

సెంట్రల్‌ బ్యాంక్‌తో ద్రవ్యోల్బణం

ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ను ఒక క్యాన్సర్‌గా ఆయన పోల్చారు. ద్రవ్యోల్బణానికి కారణంగా దుయ్యబట్టారు. ప్రచారంలో ఒక రంపం తీసుకొని అన్ని పథకాల్లో కోత వేస్తానని ప్రచారం చేయడం గమనార్హం. పొరుగు దేశమైన బ్రెజిల్‌లో అర్జెంటీనా ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా సోషలిస్టు విధానాలకు జేవియర్‌ పూర్తిగా వ్యతిరేకం. దక్షిణ అమెరికాలోని 12 దేశాలు తొలి నుంచి వామపక్ష భావజాల పార్టీలకు అనుకూలంగా ఉండేవి. గత నాలుగేళ్లలో ఈక్వెడార్‌, ఉరుగ్వే.. తాజాగా అర్జెంటీనాలో ఆ భావజాలానికి వ్యతిరేకమైన రాజకీయపక్షాలు అధికారంలోకి రావడం గమనార్హం.

అర్జెంటీనా నూతనాధ్యక్షుడిగా జేవియర్‌ మిలి

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తరహాలో జేవియర్‌ మిలి పాలన ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అర్జెంటీనాను ఆర్థిక శక్తిగా బలోపేతం చేయడంతోపాటు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆయన ఆశయం. మరి ఆ సంస్కరణలు ఫలిస్తాయా లేదా అన్నది భవిష్యత్తుపై ఆధారపడివుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని