777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?

అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే..

Published : 09 Sep 2023 17:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విరామ సమయంలో వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం వేరే లక్ష్యంతో సినిమాలు చూశాడు. ఒకటి.. రెండు కాదు ఏకంగా ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఇంతకీ అతడు ఎందుకిలా చేశాడంటే..

అమెరికాకు చెందిన 32 ఏళ్ల జాక్ స్వోప్‌కు (Zachariah Swope) సినిమాలు అంటే ఎంతో ఇష్టం. దీంతో ఆ సినిమాలతోనే వరల్డ్‌ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఓ వైపు తన ఉద్యోగం చేస్తూనే మరోవైపు థియేటర్‌లలో సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. ఉదయం 6.45 నుంచి మధ్యాహ్నం 2.45 దాకా ఉద్యోగానికి వెళ్లేవాడు. ఆ తర్వాత కుదిరిన రోజుల్లో రోజుకు కనీసం 3 సినిమాలకు తగ్గకుండా చూశాడు. సెలవు రోజుల్లో వాటిని రెట్టింపు చేశాడు. మే 2022 నుంచి ఇలా చేయడం మొదలు పెట్టిన స్వోప్‌.. మే 2023 పూర్తయే సరికి ఏకంగా 777 సినిమాలు చూశాడు. మొదటగా ‘మిలియన్స్‌: రైజ్‌ ఆఫ్ గ్రూ’ (Minions: Rise of Gru) అనే సినిమాతో ప్రారంభించి ‘ఇండియానా జోన్స్‌ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’తో పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలోనే ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు (777 movies World Record). 

అయితే ఈ రికార్డును క్రియేట్‌ చేయడం కోసం స్వోప్‌ కొన్ని నియమాలు కూడా పాటించాడు. అవేంటంటే.. సినిమాలు చూసే సమయంలో మరొక పనిచేయకూడదు. అంటే ఫోన్‌ చూడడం, నిద్రపోవడం లాంటి పనులు చేయకూడదు. అలాగే తినడం, తాగడం లాంటివి కూడా చేయకూడదట. ఈ నిబంధనలన్నీ పాటించాడని నిర్ధారణ చేసుకున్న తర్వాతే గిన్నిస్‌ యాజమాన్యం జాక్‌ స్వోప్‌ పేరును రికార్డుల్లో నమోదు చేసింది. 

భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?

అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే.. జాక్‌ స్వోప్‌ ఆటిజంపై అవగాహన పెంచడం కోసం ఈ పని చేశాడు. ‘ఆటిజం కారణంగా నేను గతంలో ఆత్మహత్యాయత్నం చేశాను. కానీ అది సరికాదని తెలుసుకున్నాను. దాని నుంచి బయటపడడం కోసం సినిమాలు చూడడం ప్రారంభించి రికార్డు సాధించాలనుకున్నా. అందుకే ఇలా చేశాను. భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి నా రికార్డును నేనే తిరగరాయాలని భావిస్తున్నా’ అని తెలిపాడు. ఇక ఈ రికార్డును సాధించినందుకు గాను అమెరికాలోని ఆత్మహత్య నివారణ సంస్థ జాక్‌ స్వోప్‌కు 7,777.77 డాలర్లను (రూ.6లక్షలు దాదాపుగా) బహుమతిగా ఇచ్చింది.

ఇక గతంలో ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్‌ క్రోన్‌ పేరు మీద ఉండేది. అతడు 715 సినిమాలు చూసి ఈ రికార్డును సృష్టించాడు. ఇప్పుడు జాక్ స్వోప్‌ 777 సినిమాలతో దాన్ని తిరగరాశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని