Brain Vacation : జీవితం గజిబిజిగా ఉందా.. ‘బ్రెయిన్ వెకేషన్’కు వెళ్లండి!
‘బ్రెయిన్ వెకేషన్’ (Brain vacation) మెదడును రీఛార్జ్ చేస్తుంది. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.
Image : Himalaya Calling
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీ అయిపోయి చాలా మంది మానసికంగా అలసిపోతున్నారు. ఒకే పరిసరాల్లో అధిక సమయం పనిచేయడం వల్ల సామర్థ్యం దెబ్బతింటోంది. సృజనాత్మకత తగ్గిపోతోంది. అలాంటి వారికి ‘బ్రెయిన్ వెకేషన్’ (Brain vacation) అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఏంటీ ‘బ్రెయిన్ వెకేషన్’? ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో తెలుసుకోండి.
- ఏడాదికి ఒకసారైనా కొందరు కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తుంటారు. అయితే, అలా వెళ్లొచ్చిన తరువాత కూడా చాలా మందిలో సంతోషం కనిపించడంలేదని 2017లో నిర్వహించిన ఓ డచ్ సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే విహార యాత్రకు వెళ్లినా.. చాలా మంది పనికి సంబంధించిన విషయాల్లోనే మునిగి తేలుతారు. అంటే ఈ మెయిళ్లకు బదులివ్వడం, సహోద్యోగులతో ఫోన్‌లో మాట్లాడటం వంటివి చేస్తుంటారు. సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి హద్దులు చెరిగి పోయాయి. అదే పని నాణ్యతను దెబ్బతీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
- ఇలాంటి సమస్యకు ‘బ్రెయిన్ వెకేషన్’ చక్కని పరిష్కారం చూపుతుందట. సాధారణ విహారయాత్రలతో పోలిస్తే బ్రెయిన్ వెకేషన్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది కొత్త దృక్పథాన్ని, ఆలోచనా విధానాన్ని అన్వేషించేందుకు దోహదం చేస్తుంది. ‘బ్రెయిన్ వెకేషన్’కు ఎక్కడికైనా వెళ్లొచ్చు. బీచ్, పర్వత ప్రాంతాలు, హిమశిఖరాలు, జన సంచారం లేని ప్రదేశాలు, రద్దీ నగరాలు అయినా సరే సానుకూల ఆలోచనలు ఉంటే ముందుకెళ్లొచ్చు.
- జీవితం ప్రతి ఒక్కరినీ డైలామాలో పడేస్తుంటుంది. ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధం కావాలనేది ఒకరి ఆలోచన. ఉన్న ఉద్యోగం వదులుకొని వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని మరొకరి ఆలోచన. సొంత కంపెనీని ఇంకా ఎలా అభివృద్ధి పథంలో నడిపించాలనేది ఇంకొకరి ఆలోచన. ఇలాంటి వారందరి కోసం బ్రెయిన్ వెకేషన్ రీట్రీట్‌లు అందించే కంపెనీలు పుట్టుకొచ్చాయి.
Image : Himalaya Calling
- బ్రెయిన్ వెకేషన్ నిత్య జీవితానికి ఒక చిన్న పాజ్ బటన్‌లాంటిదని రీట్రీట్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక్కడ మనసులో నాటుకుపోయిన భయాందోళనలను తొలగిస్తారు. అపనమ్మకాలను పోగొట్టి, కొత్త దృక్కోణాలను ఆవిష్కరిస్తారు. జీవితంలో మనకు ఇంకా ఎలాంటి అవకాశాలున్నాయో అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం సంభాషణలు, కొన్ని కార్యకలాపాలు చేయిస్తారు. ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తారు.
- ఇలా చేయడం వల్ల తాము ఎక్కడ ఆగిపోయామో సాధకులు తెలుసుకుంటారు. మళ్లీ శక్తిని కూడదీసుకొని మానసికంగా తమను తాము సన్నద్ధం చేసుకుంటారు. కొన్ని కంపెనీలు ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్టార్ గేజింగ్, ఫ్రూట్ ప్లకింగ్, యానిమల్ ట్రైల్ ఎక్స్‌ప్లోరేషన్ వంటివి బ్రెయిన్ వెకేషన్‌లో ఆఫర్ చేస్తున్నాయి. ఈ చర్యలన్నీ అయోమయం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు సాయం చేస్తాయి.
- బ్రెయిన్ వెకేషన్ వల్ల కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వారు వేర్వేరు రంగాలకు చెందినవారై ఉంటారు. వయసులో కూడా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి వారితో మాట కలపడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆ అనుభవం వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి తోడ్పడుతుంది.
- కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల రోజువారీ వాతావరణం మారడంతో సరికొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ప్రకృతిని చూస్తున్నప్పుడో, ట్రెక్కింగ్‌లో నడుస్తున్న సమయంలోనో జీవితానికి ఉపయోగకరంగా ఉండే ఆలోచన రావచ్చు. అందుకే కార్పొరేట్ ఉద్యోగులు, అంకుర సంస్థల ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు బ్రెయిన్ వెకేషన్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు.
- బ్రెయిన్ వెకేషన్‌లో అద్భుతాలు జరుగుతాయని ఊహించకూడదు. ఎలా రాసి ఉంటే అలా జరుగుతుందనే ఆలోచనతో ముందుకెళ్లాలి. ఎందుకంటే వర్షం కారణంగా కొన్నిసార్లు ట్రెక్కింగ్ ఆగిపోవచ్చు. కానీ, నిర్వాహకులు అందించిన ఆహారం, పానీయాలు తీసుకొంటూ.. ఇతరులతో సంభాషించడం కూడా కొంత ఆనందాన్నిస్తుంది.
- కొన్ని కార్యాలయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఒత్తిడి కారణంగా వారంతా మాట్లాడుకోవడం కుదరదు. ఆఫీసు సమయం ముగియగానే అంతా ఇళ్లకు వెళ్తుంటారు. అందువల్ల కొత్త స్నేహితులను వెతుక్కోవడం కోసం కూడా కొందరు బ్రెయిన్ వెకేషన్‌ను ఎంచుకుంటున్నారు.
- కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే నిపుణులు, అంకుర సంస్థల స్థాపకులతో కూడా బ్రెయిన్ వెకేషన్లు కొనసాగుతున్నాయి. వీరందరినీ నెలకోసారి ఓ ప్రదేశంలో కలిసేలా చేసి వారి అనుభవాలను పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వారు సులభంగా పరిష్కారాలను కనుగొంటున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్
-
భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం
-
చంద్రయాన్-3 మహా క్విజ్‌లో పాల్గొనండి
-
ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో చెప్పలేను..