Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?

తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే..

Updated : 23 Feb 2024 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: తోడేళ్లు (Wolfs), నక్కలు, హైనాలు వంటి జంతువులు అత్యంత తెలివితేటలను కలిగి ఉంటాయి. పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ.. జింకలు, కుందేళ్లను వేటాడుతూ జీవిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతకు సహకరిస్తుంటాయి. మన దేశంలో ప్రత్యేకమైన తోడేళ్లు Indian wolf జాతికి చెందినవి.

ఊళ వేయడం లేదు..

తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళ వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఊళ వేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. మానవ నివాసిత ప్రాంతాలు అటవీ ప్రాంతాల సమీపంలోకి విస్తరిస్తుండటం, రాత్రిళ్లు దీపాల వెలుగులు, వాహనాల రాకపోకలు.. తదితర కారణాలతో తోడేళ్ల జీవనానికి భంగం ఏర్పడుతోంది. ఈ కారణంగా అవి ఊళ వేయడం లేదని నివేదిక పేర్కొంది. అదే మానవ నివాసిత ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీప్రాంతాల్లోని తోడేళ్లు సాధారణంగానే ఉన్నట్టు తేలింది.

‘కేజీబీ వన్‌-పంచ్‌’ టెక్నిక్‌తో నావల్నీని చంపేశారా?

అటవీప్రాంతాల సమీపంలో మానవ నివాసాల వల్ల వీటి వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఊళ వేస్తే వేటగాళ్లకు చిక్కిపోతామన్న భయంతో అవి తమ జీవన విధానాన్ని మార్పు చేసుకున్నట్టు కొందరు పేర్కొంటున్నారు. మన దేశంలోని గడ్డి భూముల్లో తోడేళ్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. కానీ మానవ జనాభా పెరుగుదలతో అక్రమ నివాసిత ప్రాంతాలు గడ్డిభూముల సమీపానికి రావడం.. వీటి ఉనికికే ప్రమాదంగా పరిణమించింది. వాస్తవానికి తోడేళ్లు రాత్రిళ్లు వేట ప్రారంభించి ఉదయానికి ముగిస్తాయి. అయితే, విద్యుద్దీపాల కాంతి, ట్రాఫిక్‌ శబ్దాలు వేటకు ఆటంకంగా మారాయి.

వేట ఎలాగంటే?

తోడేళ్ల వేట ప్రత్యేకంగా ఉంటుంది. ఒక గుంపు.. జింకలను నది లేదా పొదలు ఉన్న చోటకు తరుముతుంది. అక్కడ మాటు వేసిన మరో గుంపు ఒక్కసారిగా దాడికి దిగుతుంది. జింకల సమూహంలో వేగంగా పరిగెత్తలేని వాటిని గుర్తించి.. లక్ష్యంగా ఎంచుకుంటాయి. సమూహం నుంచి విడిపోయిన వెంటనే వాటిని వేటాడుతాయి. ఇలా విభిన్న వ్యూహాలు, సమన్వయంతో ఇవి ఆహారాన్ని సంపాదిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని