‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..!’

రాత్రి పన్నెండు దాటగానే ‘వరల్డ్‌ స్లీప్‌ డే’ అని ఫోన్లో నోటిఫికేషన్‌! అది చూసే సరికి ఒకటే ఆత్రం.. ఏం పోస్టింగులు పెట్టుకోవాలా అని. మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా ఫొటో తీశారా అని అలారం మోగేదాకా వెతికేస్తాం......

Updated : 19 Mar 2021 17:17 IST

సరైన నిద్రే రాదు..

రాత్రి పన్నెండు దాటగానే ‘వరల్డ్‌ స్లీప్‌ డే’ అని ఫోన్లో నోటిఫికేషన్‌! అది చూసే సరికి ఒకటే ఆత్రం.. ఏం పోస్టింగులు పెట్టుకోవాలా అని. మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా ఫొటో తీశారా అని అలారం మోగేదాకా వెతికేస్తాం. అలాంటి చిత్రాలు దొరికితే అంతర్జాలంలో పెట్టి  నాలుగు గురక ఎమోజీలు తగిలిస్తాం. లేకపోతే మనకు నిద్దరుండదు!

నిద్రకు ప్రధాన శత్రువు మొబైల్‌ అన్న మాట ఏకగ్రీవంగా ఒప్పుకొంటాం. దాన్ని చక్కబరచడం మనిషికి చేతకాని పని అయిపోయింది. అసలు మనిషి ఆ మొబైల్‌ని పడుకోనిస్తేగా! ఒక పక్క సెలైన్‌ బాటిల్‌లా ఛార్జరు పెట్టి మరీ దాన్ని వాడేస్తుంటాం.

ఇరవై ఒకటో శతాబ్దం ముందు వరకు నిద్ర రాత్రి పూట ఎనిమిది నుంచి పది గంటలు ఉండేది. గత రెండు దశాబ్దాల్లో మాత్రం మనిషికో తీరులో మారిపోయింది. ఎవరి కళ్లు చూసినా కరడుగట్టిన తీవ్రవాదుల్లా ఎరుపు రంగులోనే కనిపిస్తున్నాయి.

బడికెళ్లే పిల్లాడు రాత్రి పదో పదకొండో అయితేగానీ పడుకోవట్లేదు. హోంవర్కుల బాధ.. అవి చేయించేందుకు ఆలస్యంగా వచ్చే అమ్మానాన్నలకు అలారం పెట్టే వీలే లేదు మరి. 

కాలేజీ పిల్లలకు చూడాల్సిన టీవీ ప్రోగ్రాములు, ఇవ్వాల్సిన సోషల్‌ రిప్లైలు.. అబ్బో.. వాళ్ల పనికే ఇరవైనాలుగు గంటలు చాలవు.. మళ్లీ నిద్రా? వాళ్లు పొద్దున్న పదకొండింటికి లేవలేక లేచి పళ్లు తోముకుంటుంటే పేస్టూ బ్రష్షూ టంగ్‌ క్లీనరూ ఎంత రోదిస్తాయో చెప్పలేం. అప్పటిదాకా పడుకుంటారా అంటే.. అబ్బే.. మధ్య మధ్యలో ఫోన్‌ పట్టుకుని సామాజిక మాధ్యమాల్లో మేము సైతం లేస్తుంటారు!

గృహిణికి నిద్రకు ముందే జగడం. ఆమె నిద్రను చందమామ ఏనాడూ చూసి ఉండదు. ఇంటి పనా.. మజాకా..? ఏ పదకొండు దాటాకో పడుకున్నా.. ఏ పద్దు లెక్కో నెమరేసుకోవడం ఓ రెండు గంటలన్నా ఉంటుంది.

చిరుద్యోగికి ప్రతి సెకెనుకూ వార్నింగు అలారంలా మోగుతూనే ఉంటుంది. ఉద్యోగార్థం అప్‌ అండ్‌ డౌన్‌ చేసే జీవులకు బస్సులో కునికిపాట్ల వల్ల పర్సులు పోగొట్టుకోవడం అస్సలు ఇష్టమే ఉండదు. 

సాఫ్ట్‌వేరు ప్రాణులకు రాత్రి ఉండదు. ఇరవైనాలుగు గంటలూ పగలే. లాప్‌టాపే వాళ్ల బతుకుల్లో చందమామ.

'రైతు నిద్ర రుతువు చేతిలో ఉంటుంది. మత్తెక్కించే పురుగుల మందు సీసాలో ఉంటుంది. 

శుష్కించిన సమాజాన్ని నడిపించే డాక్టర్లూ, ఇంజినీర్లూ, సైంటిస్టులూ, మేధావులూ నిద్రపోగలరా?

రాజకీయ చదరంగంలో అయితే ఎత్తు వేశాక ఇక నిద్ర మత్తు రానే రాదు. కునికితే కుర్చీ కాకులెత్తుకుపోవా మరి..

ఇంతకీ హాయిగా నిద్రపోయేవాడు ఎవడు? 

ఇంకెక్కడి గాఢ నిద్ర.. 

చూస్తుంటే.. కొన్నాళ్లకు పిల్లలు గురక అంటే ఏంటీ? అని అడిగే రోజులు వచ్చేస్తాయేమో అనిపిస్తోంది.

మనిషి బతకడానికి సవాలక్ష సమస్యలూ.. శతకోటి సైంధవులూ.  ఎలా నిద్రపోగలం? బాగా నిద్రపట్టడానికి ఏదైనా యాప్‌ ఉందా.. అని వెతికే కాలం ఇది. అందుకని.. ‘మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా..’ అన్న కొసరాజు మాటలు మర్చిపోవాలి. ‘మత్తు వదలకూ.. నిద్దుర మత్తు వదలకూ..’ అని అనుకోవడమే ఇప్పటి ఆరోగ్యమంత్రం. ‘సరైన నిద్ర.. ఆరోగ్యకరమైన భవిత..’ అంటూ ఈ ఏడాది వేడుకలు చేస్తున్నారు.

బాబ్బాబూ.. ఊరకే తిని తొంగోండయ్యా.. కనీసం గొడ్డులా ఆరోగ్యంగా అయినా ఉంటారు.

- కుప్పిలి సుదర్శన్‌

(మార్చి 19, వరల్డ్‌ స్లీప్‌ డే సందర్భంగా..)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని