ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: సీఎస్‌

రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని స్పష్టం చేశారు...

Updated : 18 Nov 2020 10:32 IST

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.

‘‘కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. ఏపీలో 6,890మంది కరోనా వల్ల మృతి చెందారు. మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదముంది. ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, వివిధశాఖల ఉద్యోగులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తాం. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్టు మా దృష్టికి తీసుకొచ్చారు.  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ అవసరం లేదని మేము భావిస్తున్నాం’’ అని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.

మీ లేఖ రాజ్యాంగ విరుద్ధం: నిమ్మగడ్డ

సీఎస్‌ నీలం సాహ్ని రాసిన లేఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బదులిచ్చారు. ‘మీ లేఖ  ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమే. రాజ్యంగ వ్యవస్థను కించపరచడమే. రాజ్యాంగ, చట్ట విరుద్ధం’’ అని సీఎస్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై గవర్నర్‌తో ఎస్ఈసీ చర్చించనున్నారు.

ఇదీ చదవండి

పంచాయతీ పోరు ఫిబ్రవరిలో..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని