CM KCR: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపా: కేసీఆర్‌

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వినూత్నంగా నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం,  అమర జ్యోతిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 

Updated : 22 Jun 2023 20:16 IST

హైదరాబాద్‌: ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వినూత్నంగా నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం,  అమర జ్యోతిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అమరవీరులపై రూపొందించిన ప్రదర్శనను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం తిలకించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులను సీఎం, మంత్రులు సత్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాల సందర్భంగా జరిగిన ఘట్టాలను గుర్తు చేశారు. ‘‘రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. ఈరోజు రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలి. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలికేక వినిపించింది.  ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మందితో మేధోమధనం చేశాం.  వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించాం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణ వాది, ఆయన మార్గదర్శనంలోనే నడిచాం. ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్‌ కాపాడుకొంటూ వచ్చారు. 

రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఉద్యమం నడిపాం. నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏనేతపైనా జరిగి ఉండదు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపా. నా నిరాహార దీక్ష తర్వాతే  తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయి. పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారు. ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి ఏర్పాటు చేశాం. అత్యుత్తమంగా నిర్మించుకున్నందునే అమర వీరుల స్థూపం నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతిపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు