Hyderabad: కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై కేసు నమోదు

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated : 11 Jun 2023 17:06 IST

హైదరాబాద్: భారాస కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సామ ఇంద్రపాల్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 2018లో ఉప్పరపల్లిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు సామ ఇంద్రపాల్‌ రెడ్డి ప్రయత్నించారు. అదే సమయంలో మధ్యవర్తులుగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌, రాకేశ్‌ రెడ్డి అతనికి పరిచయమయ్యారు. తమకు తెలిసిన మరికొందరు భూస్వాములు ఉన్నారని వీరిద్దరు శ్రీరామ్‌ రెడ్డి అనే మరో వ్యక్తిని ఇంద్రపాల్ రెడ్డికి పరిచయం చేశారు. స్థలం, కమీషన్‌తో కలిపి మొత్తం రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామన్నారు. కమీషన్‌ ఇచ్చేందుకు ఇంద్రపాల్‌ కూడా అంగీకరించారు.

ఈ క్రమంలో 2018 మే 24న రూ.90లక్షలు చెల్లించాడు. తర్వాత విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు చెల్లించాడు. సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డిలు బాధితుడి వద్ద బ్లాంక్‌ చెక్కులు తీసుకున్నారు. మిగిలిన రూ.60లక్షల కోసం లోన్‌కు అప్లై చేశానని అది రాగానే చెల్లిస్తానని చెప్పాడు. ఈ సొమ్ము చెల్లించడానికి ఆలస్యం అవుతుందని.. ఎమ్మెల్యే తరఫున అనుచరులు ఇంద్రపాల్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. గతేడాది జూన్‌లో తన ఇంటికి వచ్చి భార్యను బెదిరించారని, తనను గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే తన గన్‌మెన్‌ను పంపించి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. వారి చెర నుంచి తప్పించుకొని ఇంద్రపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. తాను పోలీసులను ఆశ్రయించినప్పటి నుంచి రూ.2.5 కోట్లు ఇస్తేనే గతంలో తాను ఇచ్చిన బ్లాంక్‌ చెక్కులపై ఎలాంటి చర్యలు తీసుకోమని, డిమాండ్ చేసిన డబ్బును చెల్లించకపోతే చెక్‌ బౌన్స్‌ కేసు పెడతామని బెదిరించారని ఇంద్రపాల్‌ ఫిర్యాదులో వెల్లడించారు.

తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా హైదరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లానని, అక్కడి నుంచి కేసును పశ్చిమ మండల డీసీపీకి రిఫర్‌ చేశారని బాధితుడు తెలిపారు. కానీ, డీసీపీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేశ్‌ రెడ్డిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిల్మ్‌నగర్‌ పరిధిలో జరిగిన దృష్ట్యా అనంతరం కేసును ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు