శుభకార్యాల్లోనూ అమరావతి నిరసనలు

అమరావతి ఆందోళనల నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల జరిగే శుభకార్యాలూ నిరసన వేదికలుగా మారుతున్నాయి...

Updated : 16 Feb 2020 19:28 IST

విజయవాడ: అమరావతి ఆందోళనల నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల జరిగే శుభకార్యాలూ నిరసన వేదికలుగా మారుతున్నాయి. ఎక్కడ ఏ వేడుక జరిగినా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మొన్నటికిమొన్న ఓ పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ వివాహ సమయంలో ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’ అని ప్లకార్డులతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదే తరహాలో విజయవాడలో ఓ కుటుంబం ఏర్పాటు చేసిన వేడుకలో అతిథులు తమదైన రీతిలో నిరసన తెలియజేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన తుళ్లూరి రాము, దివ్య దంపతులు మహారాష్ట్రలోని పుణెలో స్థిరపడ్డారు. వారి కుమార్తె శ్రేష్ఠ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. వేడుకకు హాజరైన బంధువులు, స్నేహితులు పచ్చ కండువాలు ధరించి ‘జై అమరావతి.. ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో జరుగుతోన్న పోరాటానికి మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేడుకకు హాజరైన అతిథులు సైతం రాజధాని రైతులకు మద్దతుగా జెండాలు పట్టుకున్నారు. రాజధాని తరలింపు ప్రకటనతో తీవ్ర నిరాశలో ఉన్నామని.. అందుకనే ఏ శుభకార్యం జరిగినా అక్కడికి వెళ్లి తమ గోడు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిరసన తెలుపుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి మనసు మార్చుకుని రాజధాని తరలింపు ప్రకటన వెనక్కితీసుకోవాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని