హృదయ స్పందన రికార్డు చేసే స్మార్ట్‌ స్కెత్‌స్కోప్‌

ఐఐటీ బాంబే విద్యార్థులు రూపొందించిన ‘డిజిటల్‌ స్టెత్‌స్కోప్’కు పేటెంట్‌ హక్కులు లభించాయి. రోగికి దూరంగా ఉంటూనే ఈ పరికరం ద్వారా ...

Published : 11 Apr 2020 21:40 IST

ఐఐటీ బాంబే అంకుర సంస్థకు దక్కిన పేటెంట్‌

ముంబయి: ఐఐటీ బాంబే విద్యార్థులు రూపొందించిన ‘డిజిటల్‌ స్టెత్‌స్కోప్’కు పేటెంట్‌ హక్కులు లభించాయి. రోగికి దూరంగా ఉంటూనే ఈ పరికరం ద్వారా వారి హృదయ స్పందనను వినొచ్చు. రికార్డు చేసి భద్రపరచొచ్చు. అవసరమైతే ఇతర వైద్యులకూ పంపించొచ్చు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ స్టెత్‌స్కోప్‌ వైద్యులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

బ్లూటూత్‌ సాంకేతికత ద్వారా రోగి హృదయ స్పందనను ఈ స్టెత్‌స్కోప్‌ వైద్యుడికి పంపిస్తుంది. రోగి రికార్డుల్లోనూ దీనిని భద్రపరచొచ్చు. ఐఐటీ బాంబేలోని ఇంక్యూబేటర్‌లో ‘ఆయు డివైజ్‌’ అనే అంకుర సంస్థ దీనిని రూపొందించింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రులకు వెయ్యి స్టెత్‌స్కోప్‌లు పంపించింది. రిలయన్స్‌ హాస్పిటల్‌, పీడీ హిందూజా ఆస్పత్రి వైద్యుల సలహాలతో దీనిని తయారుచేయడం గమనార్హం.

‘కొవిడ్‌-19 సోకిన బాధితులు ఒక్కోసారి శ్వాసను సరిగ్గా పీల్చుకోలేరు. అలాంటప్పుడు వైద్యులు స్టెత్‌స్కోప్‌ ద్వారా వారి హృదయ స్పందనను వినాల్సి ఉంటుంది. బాధితుడి దగ్గరకు వెళ్లినప్పుడు వైద్యుడికి వైరస్‌ సోకే ముప్పు ఉంటుంది. ఈ స్టెత్‌స్కోప్‌లో ఒక ట్యూబ్‌కు రెండు ఇయర్‌బడ్స్‌ఉంటాయి. రోగి హృదయ స్పందనలను ట్యూబ్‌ రికార్డు చేసి సిగ్నల్స్‌ ద్వారా ఇయర్‌ బడ్స్‌కు పంపిస్తుంది. ఈ సిగ్నళ్లను ఫోనోకార్డియోగ్రామ్‌లోనూ వీక్షించొచ్చు. వీటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపొచ్చు’ అని ఆయుడివైజ్‌ బృందంలోని ఆదర్శ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని