ప్రజలు.. ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యం: మోదీ

దేశ ప్రజల ప్రాణాలు, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటినీ కాపాడాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోద.......

Updated : 11 Apr 2020 18:43 IST

లాక్‌డౌన్‌ పొడగింపుకే సీఎంల మొగ్గు

రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం

వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి

దిల్లీ: దేశ ప్రజల ప్రాణాలు, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటినీ కాపాడాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాబోయే 3-4 వారాలు అత్యంత కీలమని పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యల ప్రభావం మరికొన్ని రోజుల తర్వాత తెలుస్తుందని వెల్లడించారు. లాక్‌డౌన్‌ ముగింపు సమీపిస్తున్న తరుణంలో  ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన పైవిధంగా మాట్లాడారని తెలిసింది.


రెండూ ముఖ్యమే

‘జాతినుద్దేశించిన తొలిసారి ప్రసంగించినప్పుడు ప్రజలు బతికుంటేనే ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగుతుందని నేనన్నాను. ఇప్పుడు మనం ప్రజల ప్రాణాలు, దేశ ఆర్థిక వ్యవస్థ.. రెండింటినీ కాపాడుకోవాలి’ అని ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అన్నారని సమాచారం. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల ప్రభావం రాబోయే 3-4 వారాల్లో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడగించడంపై ముఖ్యమంత్రుల్లో ఏకాభిప్రాయం కనిపిస్తోందని వెల్లడించారు.


వైద్యుల రక్షణకు హామీ

కరోనాపై ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత సంరక్షణ సామగ్రి (పీపీఈ) కొరతపై ప్రధాని మోదీ స్పందించారు. పీపీఈలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు, ఈశాన్య, కశ్మీర్‌ విద్యార్థుల పట్ల అనుచిత ప్రవర్తనను ఆయన ఖండించారు. ప్రతి పౌరుడి ప్రాణాలు కాపాడేందుకు లాక్‌డౌన్‌ ముఖ్యమని పేర్కొన్నారు. వ్యక్తిగత దూరం పాటించాలన్న సందేశానికి ప్రజలు కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.


రైతన్నకు అండదండలు

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్‌ నిబంధనల్లో మార్పులు చేస్తామని మోదీ అన్నారని తెలిసింది. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. నిత్యావసర సరుకులు, ఔషధాలు చాలినన్ని ఉన్నాయని తెలిపారు. బ్లాక్‌ మార్కెటింగ్‌, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయాల మార్కెట్లలో ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు రైతులే ఇంటింటికి వెళ్లి అమ్ముకొనేలా డైరెక్ట్‌ మార్కెటింగ్‌కు కృషి చేయాలన్నారు.


ఆరోగ్యసేతు ఆయుధం

కొవిడ్‌-19పై పోరాటానికి ‘ఆరోగ్యసేతు’ యాప్‌ అత్యవసర ఆయుధమని మోదీ అన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు దీనిని ఈ పాస్‌గా ఉపయోగించాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలతో కొవిడ్‌-19 ప్రభావం తగ్గిందన్నారు. నిరంతరం నిఘా వేయడమే పరమావధిగా వర్ణించారు. కాగా ఈ మహమ్మారిపై పోరాడేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరినట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని