మొబైల్‌ ఛార్జింగ్.. ఈ పొరపాట్లు చేస్తున్నారా

మొబైల్‌లో ఛార్జింగ్‌ అయిపోతుందంటే.. గుండె ఆగిపోయినంత పని అవుద్ది ఇప్పటి యువతకు. మొబైల్‌ చేతిలో ఉందంటే విశ్వమే అరచేతులో ఉన్నట్లే కదా. అందుకే యువతతోపాటు అందరూ మొబైల్‌ను అతిజాగ్రత్తగా చూసుకుంటారు. ఫోన్‌కి పౌచ్‌ కొంటారు, గొరిల్లా డిస్‌ప్లే గ్లాస్‌ వేస్తారు. తరచూ క్లీన్‌ చేస్తారు. కానీ

Updated : 13 Jul 2020 09:08 IST

మొబైల్‌లో ఛార్జింగ్‌ అయిపోతుందంటే.. గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇప్పటి యువతకు. మొబైల్‌ చేతిలో ఉందంటే విశ్వమే అరచేతులో ఉన్నట్లే కదా. అందుకే అందరూ మొబైల్‌ను అతిజాగ్రత్తగా చూసుకుంటారు. ఫోన్‌కి పౌచ్‌ కొంటారు, టెంపర్డ్‌ గ్లాస్‌‌ వేస్తారు. తరచూ క్లీన్‌ చేస్తారు. కానీ మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టే విషయంలో మాత్రం ఇప్పటికీ కొందరు కొన్ని పొరపాట్లు చేస్తారు. వాటి వల్ల మొబైల్‌ పాడయ్యే అవకాశాలున్నాయి. మరి ఛార్జింగ్‌ పెట్టే క్రమంలో అందరూ చేసే పొరపాట్లు ఏంటి? వాటికి పరిష్కారం ఏంటి?

ఛార్జర్‌ను ప్లగ్‌లోనే వదిలేయకండి

చాలా మంది మొబైల్ ఛార్జింగ్‌ పూర్తయిన తర్వాత కేవలం మొబైల్‌ నుంచి యూఎస్‌బీ వైర్‌ను మాత్రమే తీసేసి.. ప్లగ్‌లో ఛార్జర్‌ను అలాగే వదిలేస్తారు. అలా వదిలేస్తే ఛార్జర్‌ నుంచి విద్యుత్‌ యూఎస్‌బీ వైర్‌ మొత్తం ప్రసరణ అవుతుంది. కొన్ని సందర్భాల్లో షాక్‌ సర్క్యూట్‌ అయ్యే అవకాశముంది. కాబట్టి ఇకపై అలా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఛార్జింగ్‌ పూర్తయ్యాక ఛార్జర్‌ను ప్లగ్‌ నుంచి తీసేయడం మంచిదట.

ఫుల్‌ ఛార్జ్‌ చేయకండి

చాలా మంది మొబైల్‌ను పూర్తిగా ఛార్జ్‌ అంటే 100 పూర్తయ్యేవరకు ఆగుతుంటారు. దీని వల్ల మొబైల్‌ బ్యాటరీ పనిచేసే కాలం తగ్గిపోతుందనే వాదనలూ ఉన్నాయి. ప్రతి బ్యాటరీలోనూ కొన్ని ఖచ్చితమైన ఛార్జ్‌ సైకిల్స్‌ ఉంటాయి. అంటే ఒక బ్యాటరీని ఇన్ని సార్లు మాత్రమే ఛార్జింగ్‌ పెట్టాలి అనేది నిర్ణయించి ఉంటుంది. వాటిని పూర్తిగా ఛార్జ్‌ చేస్తే అవి తొందరగా పనిచేయడం మానేస్తాయి. నెలలో ఒక్కసారే 100 శాతం ఛార్జింగ్‌ పెట్టాలని, ఎల్లప్పుడూ ఛార్జింగ్‌ 20 శాతం నుంచి 80 శాతం మధ్యలోనే ఉంచాలని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. 

ఛార్జింగ్‌ జీరో అయ్యే వరకు చూడొద్దు

కొన్నిసార్లు ఛార్జింగ్‌ జీరో అయ్యే వరకు మొబైల్‌ను ఛార్జింగ్‌ పెట్టకుండా వాడుతుంటారు. అది మంచిది కాదు. ప్రస్తుత లిథియం ఆధారిత బ్యాటరీలు ఛార్జ్‌ సైకిల్స్‌తో పనిచేస్తాయి. ఒకవేళ మీరు ఛార్జింగ్‌ జీరో అయ్యే వరకు చూస్తే బ్యాటరీతోపాటు మొబైల్‌ కూడా నెమ్మదిగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

రాత్రి ఛార్జింగ్‌ పెట్టి పడుకోవడం

కొందరు రోజంతా మొబైల్‌ వాడి.. రాత్రి ఛార్జింగ్‌ పెట్టి పడుకుంటారు. సాధారణంగా రెండు, మూడు గంటల్లో ఛార్జింగ్ ఫుల్‌ అవుతుంది. కానీ రాత్రంతా ఛార్జింగ్‌ పెడితే.. మొబైల్‌ వేడెక్కే ప్రమాదం లేకపోలేదు. కొన్ని గంటలపాటు ఛార్జింగ్‌ పెట్టి వదిలేస్తే.. బ్యాటరీలోఉండే ఛార్జ్‌ సైకిల్స్‌ పాడవుతాయి. అలాగే విద్యుత్‌ బిల్లు పెరగడం ఖాయం. ఒక్కోసారి మొబైల్‌ పేలిపోవడమూ జరుగుతుంది. కాబట్టి రాత్రి అంతా ఛార్జి పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. 

ఛార్జింగ్‌ పెట్టినప్పుడు మొబైల్‌ వాడొద్దు

కొన్నిసార్లు ఛార్జింగ్‌ పెట్టి మొబైల్‌ను వాడేస్తుంటారు. కొందరు ఫోన్‌కాల్స్‌ మాట్లాడుతుంటారు. అలా చేయడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశముంది. ఛార్జ్‌ చేయడం.. వినియోగించడం ద్వారా బ్యాటరీపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మొబైల్‌కు, వినియోగదారుడుకీ చాలా ప్రమాదం. అందుకే మీరలా చేయకండి. మొబైల్‌తో పని ఉంటే ఛార్జింగ్‌ తీసి పని పూర్తయ్యాక మళ్లీ ఛార్జింగ్‌ పెట్టండి. 

పదే పదే ఛార్జింగ్‌ బ్యాటరీకి చేటు

మొబైల్‌ బ్యాటరీలో ఛార్జ్‌ ఉన్నా కొందరు పదే పదే మొబైల్‌ను ఛార్జింగ్‌ పెడుతుంటారు. ఎప్పుడు ఫుల్‌ ఛార్జ్‌లో ఉంచుకోవడం మంచిది కదా అంటుంటారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. అలా పదే పదే ఛార్జింగ్‌ చేయడం వల్ల బ్యాటరీ పనికాలం తగ్గిపోతుంది. అందుకే అవసరమైతేనే పెట్టండి. 

పౌచ్‌తో మొబైల్‌ను ఛార్జ్‌ పెట్టొద్దు

స్మార్ట్‌ ఫోన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని పౌచ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే ఫోన్‌ను పౌచ్‌లో ఉంచే చాలా మంది ఛార్జింగ్‌ పెడతారు. దీని వల్ల పెద్ద ప్రమాదమే ఉంది. ఛార్జింగ్‌ వల్ల ఫోన్‌ వేడెక్కే సందర్భంలో పౌచ్‌ ఆ వేడిని బయటకు రానీయకుండా చేస్తుంది. దీని వల్ల ఫోన్‌లోని ఇతర పరికరాలు వేడేక్కి పాడయ్యే అవకాశముంది. కాబట్టి ఈ విధానాన్ని వినియోగించకపోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం.

నాసిరకం ఛార్జర్లు వాడొద్దు

మొబైల్‌ ఫోన్‌ను కొన్నప్పుడే ఫోన్‌తోపాటు ఒక ఛార్జర్‌ వస్తుంది. దానిని మాత్రమే వాడాలి. ఛార్జింగ్‌ అవుతుంది కదా అని ఇతర ఫోన్ల ఛార్జర్లు.. నాసిరకం ఛార్జర్లు ఉపయోగించొద్దు. వేరే ఛార్జర్లు వాడటం వల్ల మీ మొబైల్‌కు ఛార్జింగ్‌ వేగంగా లేదా నెమ్మదిగా ఎక్కొచ్చు. దీని వల్ల బ్యాటరీ వేడెక్కడం.. పాడవడం జరుగుతాయి. పవర్‌ బ్యాంకుల వినియోగం విషయంలోనూ ఇంతే. 

యాప్‌లతో జాగ్రత్త

మొబైల్‌ ఛార్జింగ్‌ను పరిశీలించే కొన్ని యాప్స్‌ ఉంటాయి. అనవసరమైన సమయంలో యాప్స్‌ బ్యాక్‌‌గ్రౌండ్‌ పనిని నిలిపివేసి బ్యాటరీ పనితనాన్ని పెంచుతాయి. అయితే కొన్ని నకిలీ యాప్స్‌ యూజర్ల మొబైల్ ఛార్జింగ్‌ తొందరగా అయిపోయేలా చేస్తున్నాయి. అందుకే అలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు జాగ్రత్త వహించండి. నమ్మదగిన యాప్స్‌ను మాత్రమే వాడండి.

ల్యాప్‌టాప్‌తో ఛార్జింగా..?

ల్యాప్‌టాప్‌ ‌వాడుతున్న సమయంలో పనిలోపనిగా మొబైల్‌ను యూఎస్‌బీ పోర్టుకు కనెక్ట్‌ ఛార్జింగ్‌ చేస్తారు. దీని వల్ల నష్టం లేదు గానీ.. ఛార్జింగ్‌ చాలా నెమ్మదిగా అవుతుంది. కాబట్టి గోడకుండే ప్లగ్‌లోనే ఛార్జర్‌తో సరైన సమయంలో.. జాగ్రత్తలు పాటిస్తూ ఛార్జింగ్‌ పెట్టండి. అప్పుడే మొబైల్‌ బ్యాటరీ పనితనం బాగుంటుంది. మొబైల్‌ ఎక్కువకాలం మన్నికగా పనిచేస్తుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు