20 ఏళ్ల తర్వాత సంతానం.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చి.. అంతలోనే..

పెళ్లయిన ఇరవై సంవత్సరాల తరువాత సంతానం కలిగారన్న సంతోషం అంతలోనే ఆవిరైంది.

Updated : 10 Aug 2023 07:29 IST

అమ్మా.. అనిపించుకోవాలనే శ్వాస

మమతలు కురిపించాలనే ఆశ... 
బుజ్జి ఊసులకు తపన..
బుడి అడుగులకు నిరీక్షణ..
మొక్కని దేవుడు లేడు..
చేయని ప్రార్థన లేదు..
నవ మాసాలు నిండాయి..
పండంటి కలలు పండాయి..
మూడింతల కన్నఫలం..
మురిసిన బంధుగణం..
వేదన ముసిరిన తరుణం..
విధి కసిరిన కర్కశ క్షణం
వీడలేని వేదన..
వీడిపోలేక రోదన..

తీయని పిలుపు లేదు.. 
ముద్దు మురిపాలు లేవు..
పేగు పంచిన జన్మ..
పలకదు మరి అమ్మ..
కనుపాపలు పొగిలాయి..
అందరి గుండెలు పగిలాయి..

పల్లగిరి (నందిగామ గ్రామీణం), న్యూస్‌టుడే: పెళ్లయిన ఇరవై సంవత్సరాల తరువాత సంతానం కలిగారన్న సంతోషం అంతలోనే ఆవిరైంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తి బిడ్డలతో ముద్దూమురిపెం తీర్చుకోకుండా అనంత లోకాలకు చేరుకుంది. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న భర్త, తన భార్యను కాపాడుకోడానికి శక్తికి మించి ఖర్చుపెట్టినా ఫలితం దక్కలేదు. కన్నతల్లి ఈ లోకంలో లేదనే విషయమే స్పృహించని ఆ పసివాళ్లు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగానే తల్లి అంత్యక్రియలు ముగిసిపోయాయి. వివరాల్లోకి వెళితే..

 నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన షేక్‌ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం ఎన్నో ప్రార్థనలు చేశారు. ఎట్టకేలకు నజీరా గర్భం దాల్చడంతో ఆ కుటుంబ సభ్యులంతా ఆనందభరితులయ్యారు. పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో రక్తం ఎక్కించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మంగళవారం రాత్రి ఆమె కన్నుమూసింది. బుధవారం ఆమె మృతదేహాన్ని మెట్టినిల్లు పల్లగిరి గ్రామానికి తీసుకొచ్చి ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. భర్త, బంధువుల ఆర్తనాదాలతో విషాదం ఏర్పడింది. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఖాసిం తన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తూ పసిపిల్లలకు ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. భార్యను దక్కించుకోలేకపోయానని ఆవేదన చెందుతూ, పిల్లలను ఎలా కాపాడుకోవాలో అని ఖాసిం విలవిల్లాడుతున్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు