చిన్నారులపై డెంగీ పంజా

చిన్నారులపై డెంగీ పంజా విసురుతోంది. నిలోఫర్‌, గాంధీ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులకు వారం రోజులుగా తాకిడి పెరుగుతోంది.

Updated : 23 Sep 2023 04:39 IST

గాంధీ, నిలోఫర్‌కు పెరుగుతున్న తాకిడి
తగిన జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నారులపై డెంగీ పంజా విసురుతోంది. నిలోఫర్‌, గాంధీ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులకు వారం రోజులుగా తాకిడి పెరుగుతోంది. గాంధీలో 24 మంది చికిత్స పొందుతుండగా ఇందులో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. నిలోఫర్‌లో 16 మంది చికిత్స తీసుకుంటున్నారు. పిల్లలే కాదు.. యువత, పెద్దలు కూడా డెంగీతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో 20 మంది వరకు చేరారు. వీరిలో ముగ్గురికి కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపడటంతో ఐసీయూల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాజధానిలో 1500 పైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి.

వానలతో నీరు చేరి...

కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉండిపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధులు, స్కూళ్ల చుట్టూ నీళ్లు నిల్వ ఉండటంతో దోమల వృద్ధి చెందుతున్నాయి. డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవటానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమ కాటు బారిన పడుతున్నారు.

3 రోజులైనా తగ్గకపోతే..

డా.ఉషారాణి, సూపరింటెండెంట్‌, నిలోఫర్‌ ఆసుపత్రి

జ్వరం 3 రోజులైనా తగ్గకపోతే వెంటనే డెంగీ టెస్టు చేయించాలి. డెంగీలో తీవ్ర జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, పొట్టలో నొప్పి, వాంతులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, నీరసం తదితర లక్షణాలు ఉంటాయి. సీబీపీ పరీక్షలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నట్లు తేలినా.. డెంగీగానే అనుమానించాలి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి కానీ.. ఆందోళన అవసరం లేదు. వైద్యుల సలహా లేకుండా నొప్పినివారణ(పెయిన్‌ కిల్లర్స్‌) వాడకూడదు. ఇవి ప్లేట్‌లెట్లను మరింత తగ్గించేస్తాయి. డెంగీ నిర్ధారణ అయిన వారికి కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌, పండ్లరసాలు ఇతర ద్రవపదార్థాలు తాగిస్తూ ఉండాలి. తీవ్ర తలనొప్పి, చలితో కూడిన జ్వరం, వాంతులు, వంటిపై రాషెస్‌ రావడం, బీపీ తగ్గిపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. దోమలు పెరగకుండా ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని