ముక్కలైన విమానంలోంచి మంటలెందుకు రాలేదంటే!

కొలికోడ్‌ విమాన ప్రమాదంలో కన్నుమూసిన ఎయిర్‌ఇండియా పైలట్‌, కెప్టెన్‌ దీపక్‌ సాథె గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఆయన అనుభవం వల్లే నిజానికి భారీ ప్రాణనష్టం తప్పిందని సమాచారం. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆయన చాకచక్యంగా విమానం...

Updated : 08 Aug 2020 19:49 IST

మూడు సార్లు విమానాన్ని తిప్పి ఇంధనం ఖాళీ చేసిన పైలట్‌ దీపక్‌ సాథె

19 ఏళ్ల వయసులోనే మృత్యువు తప్పించుకున్న వైనం 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కొలికోడ్‌ విమాన ప్రమాదంలో కన్నుమూసిన ఎయిర్‌ఇండియా పైలట్‌, కెప్టెన్‌ దీపక్‌ సాథె గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఆయన అనుభవం వల్లే నిజానికి భారీ ప్రాణనష్టం తప్పిందని సమాచారం. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆయన చాకచక్యంగా విమానం నుంచి మంటలు రాకుండా అడ్డుకున్నారని అంటున్నారు. దీపక్‌ సాథె మిత్రుడు, కజిన్‌, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్థిక సలహాదారు నీలేశ్‌ సాథె తన ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్న వివరాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మంటలు రాకుండా ఇంధనం ఖాళీ?

బహుశా ల్యాండింగ్‌ గేర్లు పనిచేయలేదేమో! భారత వాయుసేన మాజీ పైలట్‌ ఇంధనాన్ని పూర్తిగా ఖర్చుచేసేందుకు విమానాశ్రయం చుట్టూ మూడుసార్లు విమానాన్ని తిప్పారు. అదే నిప్పు అంటుకోకుండా కాపాడింది. అందుకే విరిగిపోయిన విమానంలోంచి కనీసం పొగ, దుమ్ము రాలేదు. జారిపోవడానికి ముందే ఆయన విమానం ఇంజిన్లను ఆఫ్‌ చేశారు. ఆయన పొట్ట ముందుకు వంగింది. విమానం కుడిరెక్క విరిగిపోయింది. పైలట్‌ ప్రాణాలొదిలి 180 మంది ప్రయాణికులను (అధికారిక సమాచారం ప్రకారం ప్రమాదంలో 18 మంది చనిపోయారు) రక్షించారు.

కొన్ని రోజుల ముందే ఫోన్‌‌

వారం రోజుల ముందే ఆయన నాకు ఫోన్‌ చేశారు. ఎప్పటిలాగే సరదాగా మాట్లాడారు. వందేభారత్‌ మిషన్‌ గురించి అడగ్గా అరబ్‌ దేశాల నుంచి దేశపౌరులను తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఆ దేశాలు ప్రజలను రానివ్వడం లేదు కదా మీరు ఖాళీ విమానాలు తీసుకెళ్తున్నారా అని ప్రశ్నించగా ‘లేదు, ఆ దేశాలకు అవసరమైన పండ్లు, కూరగాయలు, ఔషధాలు తీసుకెళ్తాం. విమానాలు ఎప్పుడూ ఖాళీగా వెళ్లవు’ అని చెప్పారు.

19 ఏళ్లప్పుడే ప్రమాదం

ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన కొత్తలో దీపక్‌ విమాన ప్రమాదంలో గాయపడ్డారు. అప్పుడాయన వయసు 19 ఏళ్లు ఉండొచ్చు. తలకు దెబ్బలు తగలడంతో ఆరు నెలలు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన మళ్లీ విమానం నడుపుతారని ఎవ్వరూ ఊహించలేదు. గట్టి పట్టుదల, అచంచల ఆత్మవిశ్వాసం, ఎగరాలన్న ప్రేమ ఉండటంతోనే ఆయన మళ్లీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నిజంగా అదో అద్భుతమే. కానీ ఇప్పుడాయన కొలికోడ్‌ ప్రమాదంలో చనిపోయారు. ఒక సైనికుడు ఎప్పుడూ దేశ పౌరులను కాపాడేందుకే ప్రాణాలు అర్పిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని