Kamareddy: ఇది ముసాయిదా మాత్రమే.. రైతులు ఆందోళన చెందొద్దు: కామారెడ్డి కలెక్టర్‌

కామారెడ్డి పట్టణ బృహత్‌ ప్రణాళికపై రైతుల ఆందోళన దృష్ట్యా జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్‌ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్‌ కాలేదని ఆయన వెల్లడించారు.

Updated : 07 Jan 2023 15:11 IST

కామారెడ్డి: కామారెడ్డి పురపాలక సంఘం నూతన బృహత్‌ ప్రణాళికపై రైతుల ఆందోళన దృష్ట్యా ఆ జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ ముసాయిదాపై స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్‌ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్‌ కాలేదని ఆయన వెల్లడించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామన్న ఆయన.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

‘‘ప్రస్తుతం జారీ చేసింది ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ మాత్రమే. భూములు పోతాయని రైతులు ఎందుకు అపోహపడుతున్నారో తెలియట్లేదు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాం. మాస్టర్‌ ప్లాన్‌పై ఇప్పటివరకు 1,026 అభ్యర్థనలు వచ్చాయి. జోన్‌ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదు. ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఉన్నందువల్ల భూములు పోతాయని అన్నదాతలు భయపడొద్దు. దీనిపై ఎవరైనా సూచనలు ఇవ్వవచ్చని ఇప్పటికే ప్రకటించాం. అభ్యర్థనల స్వీకరణకు జనవరి 11వరకు సమయం ఉంది. భూములు పోతాయని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. పాత మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న భూములు పోలేదు కదా. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటాం’’ అని కలెక్టర్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని