
Ap News: భారీ వర్షాలకు కడప జిల్లాలో 24 మంది మృతి.. 13 మంది గల్లంతు: కలెక్టర్
కడప: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ బృందం కడప జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. జిల్లాలోని రాజంపేట మండలంలోని 4 గ్రామాలను అధికారులు పరిశీలించనున్నట్లు చెప్పారు. అలాగే కమలాపురం వద్ద కూలిన పాపాగ్ని నది వంతెనను పరిశీలిస్తారని పేర్కొన్నారు. వరదల వల్ల కడప జిల్లా వ్యాప్తంగా రూ.140 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. వరదల్లో 24 మంది మృతి చెందగా.. 13 మంది గల్లంతైనట్లు చెప్పారు. వరదలకు జిల్లాలో 75 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, 1,322 మంది వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. వరదల్లో ధ్రువపత్రాలు కోల్పోయిన వారికి మళ్లీ జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.