AP News: కోర్టు అంశాలు అర్థం కాని బ్రహ్మపదార్థంలా మిగిలిపోకూడదు: సీజేఐ

రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌

Updated : 25 Dec 2021 21:30 IST

విజయవాడ: రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆ హక్కులు లైబ్రరీలో, బహిరంగ సభలో ప్రసంగాలకో పరిమితం కాకుండా.. అట్టడుగు ప్రజలు కూడా తెలుసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. విజయవాడలోని మొగల్రాజపురం సిద్దార్థ కళశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రోటరీక్లబ్‌ అవార్డుల కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణకు రోటరీ క్లబ్‌ ప్రతినిధులు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘రూల్‌ ఆఫ్‌ లా లేకుంటే అరాచకం పెరుగుతుంది. అరాచకం పెరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు. న్యాయవ్యవస్థ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. న్యాయవ్యవస్థ భారతీయీకరణ జరగాలి. కోర్టు అంశాలు అర్థం కాని బ్రహ్మపదార్థంలా మిగిలిపోకూడదు. కోర్టుకు వచ్చే సామాన్యుడికి తన కేసు గురించి అర్థం కావాలి. దేశ వ్యాప్తంగా  న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు పెరగాలి. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వాలదే. దేశంలో 4.6 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 వ్యవస్థలూ సరిగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సీజేఐగా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నా. జడ్జిల భర్తీ, ఇతర సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నా. మన ఎదుగుదలకు, పునాదికి మాతృభాషే కీలకం. ఎన్ని భాషలు వచ్చినా ఆలోచనాత్మక ధోరణి మాతృభాషతోనే సాధ్యం. తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. రోటరీ క్లబ్‌ జీవిత సాఫల్య పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. సాధించాల్సింది చాలా ఉందని ఈ అవార్డులు గుర్తు చేస్తాయి’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

సీజేఐ గౌరవార్థం ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌, రాష్ట్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత సీఎం జగన్‌.. సీజేఐకి స్వాగతం పలికి రాష్ట్ర మంత్రులను పరిచయం చేశారు. సీజేఐ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని