AP News: ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం

ఎమ్మెల్సీ ఎం.డి.కరీమున్నీసా (56) శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. 

Updated : 20 Nov 2021 10:34 IST

విజయవాడ: ఎమ్మెల్సీ ఎం.డి.కరీమున్నీసా (56) శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న ఆమె కొద్దిరోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఆమె రెండు రోజులుగా శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కూడా కలిశారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనవడంతో వెంటనే కుటుంబసభ్యులు బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించి, గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కరీమున్నీసాకు భర్త సలీం, ఐదుగురు కుమారులు ఉన్నారు. ఆమె గతంలో విజయవాడ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు. 8 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో మరోసారి బరిలో నిలిచి ప్రచారం సాగిస్తున్న క్రమంలోనే కరీమున్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్‌ ఎంపిక చేయడంతో ఆమె అనూహ్యంగా చట్టసభకు వెళ్లారు.

పార్టీ అండగా ఉంటుంది: సీఎం జగన్‌

ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతి పట్ల సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా మరణించడం చాలా బాధకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని సీఎం తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని