Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 08 Dec 2021 08:58 IST

1. రుణ భారతం

రాను రాను దేశం రుణభారతంగా రూపాంతరం చెందుతోంది. గత ఆరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020-21 జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 87.8%కి చేరింది. 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఇందులో భారీ పెరుగుదల నమోదైంది. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌శర్మ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

2. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేల్లో ఏటీఎంలు

‘గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించే దిశగా ఆలోచన చేయాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇంకా 4,240 ఆర్‌బీకేల పరిధిలో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించాల్సి ఉందని గుర్తు చేశారు. నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) తగ్గించడంలో వాలంటీర్లు తోడుగా నిలుస్తారని చెప్పారు.

3. వారం రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తారు

సీఎం జగన్‌ వారం రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దీని అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు.విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడారు. పీఆర్‌సీ అమలు చేశాక డీఏలు ఇవ్వడానికీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. 

4. నిలదీసే అవకాశం ఉన్నా.. వాకౌట్‌ చేస్తారా?

పార్లమెంటులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌లను నిలదీసే అవకాశం ఉన్నా.. దాన్ని వినియోగించుకోకుండా తెరాస ఎంపీలు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బహిష్కరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ శివారులో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని.. ఈ వ్యవహారంలో కొందరిని ఈడీ విచారణ నుంచి తప్పించేందుకే తెరాస ఎంపీలు వాకౌట్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.

5. ఇంటింటికీ టీకాలు

తెలంగాణ రాష్ట్రంలో రెండోడోసు కొవిడ్‌ టీకాలు పొందాల్సిన లబ్ధిదారులు ఇంకా 51 శాతం మంది ఉన్నారు. వైద్యఆరోగ్యశాఖ అనేక ప్రయత్నాలు చేస్తున్నా టీకాలు పొందడానికి ఆశించిన స్పందన లభించడంలేదు. దీంతో ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేసే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

6. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు తెర!

సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ మత్తుమందుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) చేపట్టిన దర్యాప్తు తుస్సుమంది. మత్తుమందుల దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ ఆరంభించే అవకాశముంది.

7. మీరు మారకపోతే.. నేనే మార్చేస్తా

పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేనిపక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదేపదే చెప్పించుకోవడానికి ఇష్టపడరన్నారు. దిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

8. సగానికి తగ్గనున్న కొవిషీల్డ్‌  ఉత్పత్తి

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల నెలవారీ ఉత్పత్తిని కనీసం 50 శాతానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని ఆర్డర్లు రాకపోవడమే ఇందుకు కారణమన్నారు. వ్యాక్సిన్‌ అవసరాలపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.

9. ఒమిక్రాన్‌ రూపంలో మూడోదశ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం

కొవిడ్‌కి సంబంధించి ఎన్ని దశలు వచ్చినా, ఎప్పుడొచ్చినా ఉద్ధృతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. రెండోదశలో డెల్టా వేరియంట్‌ విజృంభించినట్లే.. ఒమిక్రాన్‌ రూపేణా మూడోదశ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమంది. డెల్టా కంటే ఆరింతలు వేగంగా వ్యాపించే ఒమిక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

10. అబుదాబిలో రిలయన్స్‌ పెట్టుబడులు

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (టాజిజ్‌)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) పెట్టుబడితో ఇది ఏర్పాటు కానుంది. ఈ రెండు సంస్థలు కలిసి పశ్చిమ అబుదాబిలో సంయుక్తంగా పెట్రోరసాయనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని