HYderabad: ఎయిర్‌పోర్టు మెట్రోకు ముందడుగు.. జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా 3 సంస్థలు

ఎయిర్‌పోర్టు మెట్రోకు జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్‌ డీబీ ఇంజినీరింగ్‌ సంస్థల కన్సార్టియం ఎంపికైంది.

Updated : 20 Apr 2023 20:37 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో  ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు మెట్రోకు జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్‌ డీబీ ఇంజినీరింగ్‌ సంస్థల కన్సార్టియం ఎంపికైంది. జీఈ కన్సల్టెంట్‌ ఎంపికకు సంబంధించి మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీస్‌ రెడ్డి  ప్రకటన విడుదల చేశారు. జనరల్‌ కన్సల్టెంట్‌ ఎంపిక కోసం మొత్తం 5 అంతర్జాతీయ కన్సార్టియంలు పోటీపడ్డాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, పురపాలకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణరావు, అర్వింద్‌ కుమార్‌, మెట్రోరైల్‌ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తో పాటు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ వాటిని పరిశీలించింది. 

ఐదు కన్సార్టియాల  సాంకేతిక సామర్థ్యం, వారి అనుభవం పరిగణనలోకి తీసుకుని కన్సార్టియంను ఎంపిక చేశారు. సిస్ట్రా నేతృత్వంలోని కన్సార్టియంకు అన్ని అర్హతలు ఉండటంతో టెండర్‌ లభించిందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. సాంకేతికంగా అత్యధిక మార్కులు పొందడంతో పాటు, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు అందరికంటే తక్కువ మొత్తంలో రూ.98.54 కోట్లు కోటు చేసినట్టు పేర్కొన్నారు. కన్సార్టియంలోని 3 సంస్థలు ప్రజా రవాణారంగంలో... ముఖ్యంగా మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న సంస్థలుగా ప్రఖ్యాతి చెందాయని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారతీయ రైల్వేలకు చెందిన రైట్స్‌, జర్మనీకి చెందిన డీబీ సంస్థలకు ప్రముఖ ఇంజినీరింగ్‌ దిగ్గజాలుగా పేరుంది. 

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో నిష్ణాతులైన 18మంది ఇంజినీరింగ్‌ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70మంది సీనియర్‌ ఇంజినీర్లు తదితర సిబ్బందిని కన్సార్టియం సమకూర్చుతుంది. ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని, ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్‌ డాక్యుమెంట్లను త్వరలోనే తయారు చేస్తుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు