Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Aug 2023 13:18 IST

1. తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను (Commercial LPG cylinder price) చమురు సంస్థలు సవరించాయి. 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్‌ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,680కు దిగొచ్చింది. అయితే గృహ వినియోగ సిలిండర్‌ ధరలో (domestic LPG gas cylinders) మాత్రం ఎటువంటి మార్పూ లేదు. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉద్రిక్తంగా హరియాణా.. అమల్లోకి కర్ఫ్యూ

రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా(Haryana)లోని నూహ్‌ జిల్లాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మృతి  చెందగా.. రాత్రి జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి ప్రాణలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరుకోగా.. దాదాపు 45 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. నూహ్‌జిల్లాకు ఆనుకొని ఉన్న గురుగ్రామ్‌లోనూ ఈ ఘర్షణల ప్రభావం పడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆగస్టు 8న ‘అవిశ్వాసం’పై పార్లమెంట్‌లో చర్చ..

విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No-Trust Motion)పై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ మాట్లాడతారని స్పీకర్‌ వెల్లడించించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్‌

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ (Big Saving Days Sale)ను ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ ‘టెట్‌’ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. రేపటి నుంచి ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలను https://tstet.cgg.gov.in/లో చూడొచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అలాంటి వారికి హారతి ఇవ్వాలా..?: సీఎం యోగి

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్ల కూల్చివేతను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) సమర్థించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్నిక వివాదం.. మంత్రి కొప్పుల పిటిషన్‌ కొట్టివేత

తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో కొప్పుల ఈశ్వర్‌ గెలిచారని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2018లో పిటిషన్‌ దాఖలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మస్క్‌కు షాకిచ్చిన శాన్‌ఫ్రాన్సిస్కో యంత్రాంగం.. కార్యాలయంపై ఎక్స్‌ లోగో తొలగింపు

ట్విటర్‌(Twitter)ను ఓ సూపర్‌ యాప్‌గా మార్చే క్రమంలో దాని పేరును ఎక్స్‌ (X)గా మార్చారు ఎలాన్‌ మస్క్‌(Elon Musk). దీంతో ట్విటర్‌ పిట్ట స్థానంలో X లోగో వచ్చి చేరింది. ఇందులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో(San Fransisco)లోని ప్రధాన కార్యాలయంపై ఎక్స్‌ లోగోను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో శాన్‌ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం లోగోను తొలగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాజీ ఎంపీ రాయపాటి సహా ట్రాన్స్‌స్ట్రాయ్‌ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు

ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మలినేని సాంబశివరావుతో పాటు మరికొందరు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌, గుంటూరులో 9 చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు.. రైతుయాత్రను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు వాహిని కాలువ పొడిగించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రైతుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుయాత్రకు పిలుపునిచ్చారు. నిధుల విడుదల కోసం సీఎం జగన్‌ను కలవాలని రైతులు నిర్ణయించారు. దీనిలో భాగంగా పెదనందిపాడు నుంచి యాత్రగా వెళ్లేందుకు సిద్ధమవగా అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని