Haryana: ఉద్రిక్తంగా హరియాణా.. అమల్లోకి కర్ఫ్యూ

హరియాణా(Haryana)లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు ఘర్షణలకు కేంద్రబిందువైన నూహ్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.

Updated : 01 Aug 2023 16:00 IST

గురుగ్రామ్‌: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా(Haryana)లోని నూహ్‌ జిల్లాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మృతి  చెందగా.. రాత్రి జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి ప్రాణలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరుకోగా.. దాదాపు 45 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. నూహ్‌జిల్లాకు ఆనుకొని ఉన్న గురుగ్రామ్‌లోనూ ఈ ఘర్షణల ప్రభావం పడింది.

మంగళవారం నూహ్‌ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించినట్లు హోం మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. అలాగే భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 20 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. బాధ్యుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

కనీవినీ ఎరుగని ఘోరం

ప్రస్తుత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్(Chief Minister Manohar Lal Khattar) వెల్లడించారు. ‘ఈ ఘటన దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని కోరుతున్నాను. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం’ అని భరోసా ఇచ్చారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. అలాగే ఈ రోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సామాజిక మాధ్యమంలో ఉంచిన ఒక వీడియో దీనంతటికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని